వద్దంటే వినదు... వారించేదెలా? | Sakshi
Sakshi News home page

వద్దంటే వినదు... వారించేదెలా?

Published Sun, Jan 31 2016 1:06 AM

వద్దంటే వినదు... వారించేదెలా?

 మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. చాలా హుషారుగా ఉంటాడు. కానీ వాడితో ఒక్కటే సమస్య. చిన్న మాట అంటే చాలు, ఏడ్చేస్తాడు. ఎంత ఏడుస్తాడంటే... ఏం చెప్పినా, ఏం ఇచ్చినా ఊరుకోడు. ప్రతి చిన్నదానికీ ఏడుస్తుంటే ఒక్కోసారి విసుగొచ్చేస్తుంది. అలా ఏడవడం మంచిది కాదని ఎంత చెప్పినా వినడు. అలా చెప్పినందుకు ఇంకా గట్టిగా ఏడుస్తాడు. పెద్దవాడవుతున్నా తన ప్రవర్తన ఎందుకు మారడం లేదు? ఇలా ఊరికూరికే ఏడవడం అనేది మానసిక సమస్యా?
 - శ్రీవిద్య, హైదరాబాద్
  బాబు అలిగినప్పుడు మీరు బాగా బతిమాలతారనుకుంటా. అది బాగా అలవాటై ఇలా చేస్తున్నట్టున్నాడు. క్రమశిక్షణ నేర్పే క్రమంలో ఏదైనా అంటే ఇంత ఉక్రోషం రావడం అంత మంచిది కాదు. కొన్నాళ్లు అందరూ తనని  బతిమాలడం మానేయండి. ఏడిస్తే ఏడవనివ్వండి. ఏడ్చి ఏడ్చి తనే ఊరుకుంటాడు. ఏడుస్తున్నాడు కదా అని మీరు జాలిపడి బతిమాలడం మొదలుపెడితే మళ్లీ మొండికేస్తాడు. కాబట్టి ఏడుపు ఆపి రమ్మని చెప్పండి. వస్తే వస్తాడు. లేదంటే తననలా వదిలేసి ఎవరి పని వాళ్లు చూసుకోండి. ఎంతకీ పిలవకపోయేసరికి విషయం అర్థమై తనే దిగి వస్తాడు. అయితే ఒకరు వదిలేసి నప్పుడు మరొకరు చేరదీయడం చేయ వద్దు. అందరూ ఒకే మాట మీద ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. బాబుది మానసిక సమస్యేమీ కాదు. కేవలం తన మాట చెల్లేలా చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. చెల్లదని తెలిసిన రోజున తనే దారికొస్తాడు. కంగారు పడకండి.
 
  మా పాప ఐదో త రగతి చదువుతోంది. మహా చురుగ్గా ఉంటుంది. కాకపోతే తనతో ఒకటే సమస్య. తన వస్తువులు వాళ్లకీ వీళ్లకీ ఇచ్చేస్తూ ఉంటుంది. స్కూలు నుంచి వచ్చాక చూస్తే ఏదో ఒక వస్తువు ఉండదు. ఏం చేశావ్ అని అడిగితే... ఫలానా వాళ్లకి లేదు, అందుకే ఇచ్చేశాను అంటుంది. అలా ఎందుకిచ్చావ్ అంటే వాళ్లకు లేదు, పాపం కదా అంటుంది. ఆ మంచితనం ఉండటం మంచిదే. కానీ ఎప్పుడైనా ఓసారి అంటే ఫర్వాలేదు. ఇలా తరచూ అంటే కొని ఇవ్వడం మాకూ ఇబ్బందే కదా. పాపపై చెడు ప్రభావం పడకుండా తనకెలా నచ్చజెప్పాలో సలహా ఇవ్వండి.
 - పి.రంగనాథ్, రేపల్లె
  పాప తన వస్తువులు అందరికీ ఎందుకు ఇచ్చేస్తుందో తెలుసుకోవడం అవసరం. అవన్నీ ఇస్తే వాళ్లు తనతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారని ఇస్తోందా లేక వాళ్ల దగ్గర లేనివి తన దగ్గర ఉన్నందుకు గిల్టీగా ఫీలవుతోందో? లేదంటే వాళ్లకు లేవని జాలిపడి సాయం చేయాలనుకుంటోందా? నెమ్మదిగా తనతో మాట్లాడి తన సమాధానం ఏమిటో తెలుసుకోండి. ఇలాంటివన్నీ చప్పున అడిగి తేల్చేసుకునే విషయాలు కావు. పాప మానసిక స్థితి, ఆలోచనలపై ఇదంతా ఆధారపడి ఉంది. కాబట్టి తను అలా చేసినప్పుడల్లా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండండి. గట్టిగా అరవొద్దు. ఫ్రెండ్లీగా మాట్లాడి తెలుసుకోండి. తన సమాధానాన్ని బట్టి దీనికి పరిష్కారం ఉంటుంది. జాలిపడి ఇస్తోంటే అది తప్పు కాదు. కానీ మన పరిస్థితి కూడా అందరికీ అన్నీ ఇచ్చేసేంత గొప్పది కాదు, మనకీ కష్టాలు ఉన్నాయి అన్న విషయాన్ని మెల్లగా నచ్చజెప్పండి. తను అలా ఇవ్వడం వల్ల మీరు పడే ఇబ్బంది గురించి తెలియజేయండి. అలా కాకుండా గిల్టీగా ఫీలవుతున్నా, తనతో వాళ్లు ఫ్రెండ్లీగా ఉండటం కోసం ఇచ్చేస్తున్నా ఓ మంచి కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తనకు అర్థమయ్యేలా వివరించి ఆ అలవాటు మాన్పిస్తారు.
 
  మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కానీ వాడు సరిగ్గా చదవడం లేదు. అదేంటో వాడసలు హుషారుగానే ఉండడు. ఎప్పుడూ బద్దకంగా, నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. పొద్దున్నే లేవడు. పుస్తకం పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తూ నిద్రపోతుంటాడు. క్లాస్‌లో కూడా ఒక్కోసారి నిద్రపోతాడని టీచర్లు కంప్లయింట్ చేస్తున్నారు. ఇంత నిద్ర రావడం ఏదైనా సమస్యా?
 - కె.నీలిమ, నిజాంపేట
 బాబు ఇంతకుముందు బాగా చదివి, కేవలం ఈ మధ్యే ఇలా ఉంటున్నాడా లేక ఎప్పుడూ ఇంతేనా అన్నది మీరు చెప్పలేదు. తనకు నిజంగా నిద్ర వస్తోందా లేక చదవడం ఇష్టం లేక, చదవలేక అలా ఉంటున్నాడా అన్నది కూడా స్పష్టంగా రాయలేదు. రాత్రి నిద్రపోయినా పగలంతా తనకు నిద్ర వస్తోంది అంటే కనుక ఒక్కసారి స్లీప్ స్పెషలిస్టుకు కానీ, ఈఎన్‌టీ స్పెషలిస్టుకు గానీ చూపించండి. ఎందుకంటే, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటే అలా నిద్ర వస్తుంది. అయితే అది మానసిక సమస్య కాదు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ సమస్యా లేకుండా బాబు కేవలం నిద్ర వచ్చినట్టు నటిస్తూ కనుక ఉంటే... ఒక్కసారి చైల్డ్ సైకియాట్రిస్టుకు చూపించండి. చదువుకు సంబంధించిన సమస్యలు (ఐక్యూ కానీ కాన్సట్రేషన్ కానీ తక్కువ ఉండటం) ఏవైనా ఉన్నాయేమో పరీక్షిస్తారు. తన సమస్య ఏమిటో తెలిస్తే బాబుని ఈ స్థితి నుంచి బయట పడేయడం ఎలానో తెలుస్తుంది.

Advertisement
Advertisement