కెరీర్ ఫస్ట్ | Sakshi
Sakshi News home page

కెరీర్ ఫస్ట్

Published Thu, Dec 25 2014 11:32 PM

కెరీర్ ఫస్ట్

చదువైపోగానే ఎవరైనా తట్టేది జాబ్ డోర్‌నే. అబ్బాయిలైతే ఓకే..! మరి అమ్మాయిలకు! ఇంట్లో పరిస్థితులు, వారికున్న ఆసక్తిని బట్టి ఆప్షన్లు మారిపోతుంటాయి. కొందరు ఉద్యోగ బాట పడితే... మరికొందరు పెళ్లి పీటలెక్కుతారు. ఇవన్నీ సరే... అసలు వారి మనసులో ఏముంది..! వారి పట్ల అబ్బాయిల ఆలోచనా ధోరణి ఏమిటి..! ఉద్యోగమా..! పెళ్లా..! ఏఎస్‌రావ్‌నగర్ శ్రీమేథావి కళాశాల విద్యార్థులను ఇదే ప్రశ్న వేస్తే... చక్కని చర్చకు తెర తీశారు. ఆ డిస్కషనే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’...
 
CAMPUS కబుర్లు
శ్రీలత: ఈరోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలనే తేడా లేదు. ఎవరికైనా తొలి ప్రయారిటీ కెరీరే.
శశికళ: శ్రీలత చెప్పింది నిజమే కానీ... చదువు, ఉద్యోగాలను సీరియస్‌గా తీసుకోని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ముఖ్యంగా అన్‌ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే... అమ్మాయిలకు పెళ్లి చేయడమే లక్ష్యం అనుకుంటారు.
సాయిప్రకాశ్: ఆ పని చేయడం వెనక కారణం... అమ్మాయిలు ఉద్యోగం చేయకూడదని కాదు. వారి భారం తగ్గించుకోవాలని. ఏ తల్లిదండ్రులకైనా అమ్మాయికి పెళ్లి చేయడానికి మించిన పెద్ద బాధ్యత ఏముంటుంది?
నేహా: అది నిజమే కానీ... అమ్మాయి ఏం చదివింది... ఎక్కడ పనిచేస్తుంది.. ఎంత సంపాదిస్తుంది.. అనే లెక్కలడిగే మగ పెళ్లివారి సంఖ్య కూడా పెరుగుతోంది కదా!
ఆయేషా: పోనీలే... అలాగైనా ఆడపిల్లలకు కెరీర్ యాంబిషన్స్ నెరవేరే అవకాశం వస్తుంది.
భవ్య: మనం చదువుకునేది మన కోసమే కదా! కాబట్టి మన గోల్ రీచ్ అయ్యేవరకూ పెళ్లి ప్రసక్తి ఎత్తకూడదని ఇంట్లో వారికి ముందుగానే చెప్పేయాలి.
భవ్య: చెబుతాం. కానీ వారు మన మాట వినాలి కదా! మగ పిల్లల ఉద్యోగం గురించి ఆలోచించినంతగా మన గురించీ ఆలోచించాలి.
సాయిప్రకాశ్: మా అక్కకి, నాకూ చార్టర్‌‌డ ఎకౌంటంట్ అవ్వాలన్నది కోరిక. ఇద్దరినీ ఒకే రకమైన శ్రద్ధతో చదివిస్తున్నారు
 మా తల్లిదండ్రులు.
శశికళ: దట్స్ గ్రేట్... కానీ ఒక ఏజ్ వచ్చేసరికి ఆలోచనలు మారిపోతాయి. అమ్మాయి డిగ్రీలో ఉండగా మంచి సంబంధం వచ్చిందనుకోండి.. వెంటనే ఆమెపై ప్రెజర్ మొదలుపెడతారు.
విష్ణు: అప్పుడు పెళ్లి తర్వాత కూడా అమ్మాయిలు చదువు కొనసాగించి అనుకున్న లక్ష్యం చేరుకునే ప్రయత్నం చేయాలి.
సాయి తన్మయి: పెళ్లి తర్వాత మా ఇష్టం ఏముంటుంది. మా అమ్మ పెళ్లికి ముందు పెద్దగా చదువుకోలేదు. కానీ మా నాన్న మమ్మల్ని, అమ్మని చదివించారు. అమ్మ ఇప్పుడు బిజినెస్ చేస్తూ మా అందరికీ ఆదర్శంగా నిలిచింది. దానికి కారణం మా నాన్న. అలా ఎంతమంది భర్తలుంటారు చెప్పండి!.
శశికళ: భార్య తనకన్నా మంచి చదువు చదువుకున్నా... పెద్ద ఉద్యోగం చేస్తున్నా భర్తకు ఇగో ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో పెళ్లి తర్వాత చదువుకి ఇష్టపడడు.
సాయిప్రకాశ్: అలా ఏముండదు... మా కన్నా మరీ ఎక్కువ కాకుండా సమానంగా ఉండే ఉద్యోగం చేస్తే ఓకే.
భవ్య: చూశారు కదా! అబ్బాయిలంతా అలాగే ఆలోచిస్తారు. దాంతో పెళ్లి తర్వాత అమ్మాయిల కెరీర్ లక్ష్యాలు నెరవేరడం చాలా రేర్.
అభిషేక్: అలాగేం లేదు... ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిల మాటే చెల్లుతోంది.
హరిణి: అమ్మానాన్నల దగ్గరే మాట చెల్లేది. అందుకే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్లికి ముందే కెరీర్‌కు పునాది వేసుకోవాలి.  
సాయి తన్మయి: ఎగ్జాట్లీ... అమ్మాయిలకు అది కష్టమైన పనే అయినా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. లేదంటే ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది.
విజయ్: యస్... ఇద్దరూ ఉద్యోగం చేస్తే గానీ రోజులు వెళ్లడం లేదు. కాబట్టి కెరీర్ గురించి ఇద్దరూ సీరియస్‌గా ఆలోచించాలి.
ఆయేషా: ఏదో ఒక ఉద్యోగం అనుకోకుండా కెరీర్ గురించి రకరకాల ఆప్షన్లు పెట్టుకోవడం మంచిది. పూర్వం అవేర్‌నెస్ తక్కువగా ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రపంచంలో ఉన్న ఆప్షన్లన్నీ తెలుసుకోగలుగుతున్నాం. అవకాశాలు, ఆసక్తి ఉన్న ఫీల్డ్‌ని ఎంచుకునే వెసులుబాటు ఉంది.
హరిణి: ఒకప్పుడు డాక్టర్, ఇంజనీర్ తప్ప మరో పదాలు వినిపించేవి కాదు. ఇప్పుడలా కాదు. నెట్‌వర్క్ పెరిగింది. నెట్‌సాయం పెరిగింది. కాబట్టి ఎవరికి కావల్సిన సమచారం వారు తెలుసుకోవచ్చు. తల్లిదండ్రుల ప్రోత్సాహం... పెళ్లి ప్రెజర్ లేకపోతే చాలు అమ్మాయిలు అద్భుతాలు చేసి చూపిస్తారు.
విజయ్: అప్పుడు మాకు ఉద్యోగాలు ఉండవు..!

Advertisement
Advertisement