విశ్వాసిని అజేయునిగా చేసే ‘లెంట్‌’ | Sakshi
Sakshi News home page

విశ్వాసిని అజేయునిగా చేసే ‘లెంట్‌’

Published Sun, Feb 26 2017 1:28 AM

విశ్వాసిని అజేయునిగా చేసే ‘లెంట్‌’

విశ్వాసి... శరీరం– ఆత్మల, సమన్వయ– సమున్నత కలయిక. ఈ రెండూ భిన్న నియమాలతోనే నడిచినా విశ్వాసిలో దేవుని ప్రతినిధిగా ఉన్న ఆత్మే అతనికి దిశానిర్దేశం చేస్తుంది. అందువల్ల రెండింటి మధ్య సమన్వయ సాధనకు ఉపకరించేదే ఈస్టర్‌ ఆదివారానికి ముందు భస్మ బుధవారంతో ఆరంభమయ్యే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష. అదే ‘లెంట్‌’. యేసుప్రభువు కూడా బాప్తిస్మం తీసుకున్న వెంటనే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కూడా తరచు ఏకాంత ఉపవాస ప్రార్థనలు చేసి దేవునితో తన అనుబంధాన్ని చాటుకున్నారు. ఆహారం అనేది మనిషి ఎంతో ప్రియంగా ఆస్వాదించే లోకపరమైన అంశం. అలాంటి ఆహారాన్ని సేవించకుండా ఉపవాసానికి పూనుకోవడం ద్వారా విశ్వాసి దేవునికి తనకూ గల అనుబంధం ఎంత ప్రగాఢమైనదో రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఉపవాసానికి ప్రార్థన కూడా తోడైతే ఆ ప్రక్రియలో విశ్వాసి ఒక అజేయమైన శక్తిగా రూపొందుతాడని యేసుక్రీస్తే వెల్లడించాడు (మార్కు 9:29, మత్తయి 17:21).

ఉపవాస ప్రార్థనా దీక్షతో ఉపవాసానికి, ప్రార్థనకు కూడా ప్రాధాన్యతనివ్వకపోతే ఆ దీక్షకు అర్థం, విలువ ఉండదు. యూదు నియమావళి ప్రకారం సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకొని, సూర్యాస్తమయం తర్వాత మళ్లీ ఆహారం సేవించే వరకు దాదాపుగా 12 గంటలపాటు చేసేదే ఉపవాసదీక్ష! శరీరంలోని ద్రావిక సమతుల్యం కోసం అవసరమైన మేరకు నీళ్లు తాగడంలో తప్పు లేదు. వృద్ధులు, మధుమేహం ఉన్నవారు ఒకటి లేదా రెండుసార్లు ఏదైనా ఫలరసాన్ని సేవించడమూ నిషిద్ధం కాదు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కూడా అవసరానికి మించి భోంచేయడం అనేది ఆ దీక్ష ఉద్దేశ్యాన్నే చెరుపుతుందన్నది గమనించాలి.

ఈ నలభై రోజుల దీక్షలోనూ ఆహారాన్ని సేవించడంలోనే కాదు అన్ని విషయాల్లోనూ మితంగా వ్యవహరించడం ద్వారా దేవుని మనం ఘనపర్చుతామన్నది గుర్తుంచుకోవాలి.  మాంసాహారం యూదు సంస్కృతి ప్రకారం నిషిద్ధం కాకున్నా, శరీరాన్ని అదుపు చేసుకునే ఒక ప్రక్రియ గనుక ‘శాకాహారం’ ఆ ధ్యేయ సాధనకు ఉపకరిస్తుందన్నది కొందరు పెద్దల అభిప్రాయం. ఎవరితోనైనా విభేదాలున్నా, గొడవలున్నా వాటిని సరిచేసుకొని వారితో సంబంధాలు పునరుద్ధరించుకోవడం దీక్షాపరులు చేయవలసిన పని. ఈ నలభై రోజులే కాదు... ఆ తర్వాత కూడా చేతనైనంతగా ఇతరులకు, నిర్భాగ్యులకు సాయం చేయడం దేవుడు మెచ్చే సత్కార్యం తోటివారితో మనం ఎంత సఖ్యతతో వ్యవహరిస్తున్నామనేదే దేవునితో మన అనుబంధం ఎంత ప్రగాఢంగా ఉందనడానికి గీటురాయి అని మర్చిపోరాదు.

మొత్తం నలభై రోజులూ దీక్ష చేయగలిగితే మంచిది. అలా కాకున్నా మన పరిస్థితుల మేరకు కొన్ని రోజులైనా దీక్షను నిబద్ధతతో చేయడం మంచిది. దీక్షలో ఉన్న దినంలో అత్యధిక భాగాన్ని దైవ వాక్యధ్యానంలో, ప్రార్థనలో గడపలేకపోతే అది ఉపవాస ప్రార్థనా దీక్ష కాదు. ఉపవాస ప్రార్థనా దీక్ష... దేవుని శక్తి మన జీవితంలోనికి ప్రవేశించే గవాక్షాలను తెరిచి విశాలం చేస్తుంది. అలా మనలోకి ప్రవేశించే దేవుని శక్తి మనలో, కుటుంబంలో ఎన్నో అద్భుతకార్యాలు జరిగేందుకు కారణమవుతుంది.

దీక్ష రోజున ఆఫీసులో లేదా మీ మీ పనుల్లో నిమగ్నమై ఉన్నా, విరామ సమయాన్ని ప్రార్థనలో, వాక్యపఠనంలో గడపండి, పదిమందికీ సాయం చేయండి. ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసిగా, పరిణతి చెందండి. అదే ఉపవాస ప్రార్థనా దీక్ష ఉద్దేశ్యం.
– రెవ.డాక్టర్‌.టి.ఎ. ప్రభుకిరణ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement