దీక్ష... దక్షత | Sakshi
Sakshi News home page

దీక్ష... దక్షత

Published Sun, Apr 5 2015 11:45 PM

దీక్ష... దక్షత

విద్యావిధానంలో మార్పు తీసుకువచ్చిన సంస్కర్త... అనేక కాలేజీలకు, పాఠశాలలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుభవం... నానమ్మ.కో ద్వారా కోట్లాది మందికి చేరువైన అమ్మమ్మ... వేదాలను తన కంఠంలో పలికిస్తున్న అపర ఋషీమణి...  స్త్రీరత్న వంటి అనేక పురస్కారాల గ్రహీత... ఇవీ పప్పు జయ వేణుగోపాల్ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే. తన విశ్రాంత జీవితాన్ని ప్రజోపయోగం కోసం అంకితం చేసిన జయ వేణుగోపాల్... ‘అవిశ్రాంతం’ కోసం చెప్పిన విశేషాలివి.
 
మా స్వస్థలం విజయనగరం. నాన్నగారు మిలిటరీలో పని చేస్తుండటం వల్ల రకరకాల ప్రాంతాలకు బదిలీ అవుతుండేవాళ్లం. 1971లో బి.ఇడి. చదువుతుండగా, ప్రముఖ సంగీతకారులు, రచయిత... పప్పు వేణుగోపాలరావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.  పెద్దలను ఎదిరించి మేమిద్దరం వివాహం చేసుకున్నాం. ఇద్దరం ఉద్యోగ జీవితం ప్రారంభించాం. అనేక పాఠశాలల్లో పని చేశాం. చివరికి మద్రాసులో స్థిరపడ్డాం.

విద్యావిధానంలో మార్పులు తీసుకురావడానికి మద్రాసు విద్యాశాఖకు ఎన్నో సూచనలు, సలహాలు  ఇచ్చాను. పుస్తకాలకు స్వస్తి పలికి, కంప్యూటర్లు ప్రవేశపెట్టాను. అది మంచి ఫలితాలనిచ్చింది. ఓ పక్కన ఉద్యోగం చేస్తూనే మరో పక్క మద్రాసు యూనివ ర్శిటీలో పిహెచ్‌డి చేశాను. ఎక్కడ ఏ పాఠశాల వారు నన్ను  ఆహ్వానించినా, నా ఇన్నోవేషన్స్‌కి ఒప్పుకుంటేనే పని చేస్తానని చెప్పాను. వారు అంగీకరించేవారు. అలా అనుకున్నవన్నీ ఒక్కటొక్కటిగా ప్రవేశపెట్టాను. 1993 - 96లో ఎన్‌సిఇఆర్‌టి జాతీయ అవార్డు నన్ను వరించింది. 1996లో చిన్మయ రెసిడెన్షియల్ స్కూల్‌లో నన్ను పని చేయమని అడిగారు. అక్కడకు వెళ్లి నేను మొదటి ప్రిన్సిపాల్‌గా డెరైక్టర్‌గా క్లాస్‌లోనే కంప్యూటర్లు పెట్టేశాను. పరీక్షలు ఉండవు. ఈ - క్లాస్ ఇంట్రడ్యూస్ చేశాను. అక్కడ కూడా మంచి ఫలితాలు సాధించాను.

పైదంతా గతం...: ప్రస్తుతం చెన్కి దూరంగా మహాబలిపురానికి సమీపంలో వానప్రస్థంలో ఉన్నాను. యేటా ఒక నెల పాటు మౌన దీక్షలో ఉంటాను. అప్పుడు రోజుకి కేవలం నాలుగు పళ్లు, పొద్దున్న అర కప్పు పాలు నా ఆహారం. ఆ దీక్ష పూర్తి కాగానే, నా బృహత్కార్యంలోకి వచ్చేస్తాను. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారతాలు అన్నిటినీ చదివి వినిపిస్తూ వాటికి అర్థం చెప్పడం ప్రస్తుతం నా ప్రణాళిక. నేను చేస్తుండే మౌన దీక్ష ఇచ్చిన శక్తి ఇది నాకు. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఇందులోని ప్రతి అంశాన్నీ కేవలం పది నిమిషాల నిడివిలోకి వచ్చేలా తయారు చేస్తున్నాను. పిల్లలకు చేరువ కావడానికి అనువుగా  నానమ్మ డాట్ కో ప్రారంభించాను.  ఇందులో చిన్న పిల్లలకు కావలసిన ఎన్నో కథలు తయారుచేశాను. ప్రస్తుతం వాల్మీకి రామాయణం చేస్తున్నాను.   వేదాల వంటివి బ్రహ్మచర్యంలోనే చదవాలి. అప్పుడే యువతకు ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, పట్టుదల, సన్మార్గంలో పయనించడం వంటి మంచి అలవాట్లు అలవడతాయి. అందరికీ జ్ఞానం కలిగించాలనే లక్ష్యంతో పురాణాలు, ఇతిహాసాలు అన్నీ సులువుగా అర్థమయ్యేలా తయారు చేస్తున్నాను. 108 ఉపనిషత్తులు కూడా ఇందులో పొందుపరిచాను.

ఇది ఐదేళ్ల ప్రాజెక్టు. వెబ్‌సైట్  మొదలుపెట్టినప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు. కాని ఇప్పుడు దీన్ని రెండు కోట్ల మందికి పైగా చూస్తున్నారు. పురాణాలకు సంబంధించి వంద క్యాంపులు నిర్వహించాను. విష్ణుపురాణాన్ని ఎగ్జిబిట్ చేశాను. ‘ఇంత పని చేస్తావు. విశ్రాంతి తీసుకోవు ఎందుకు?’ అని మా వారు తరచు ప్రశ్నిస్తుంటారు. నాకు పని చేస్తుంటేనే చురుకుగా అనిపిస్తుంది. ఈ విశ్రాంత జీవితం ఇలా నలుగురికీ ఉపయోగపడటం కంటె ఇంకేం కావాలి?
 - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
 

Advertisement
Advertisement