మీ అమ్మాయి ప్రేమలో ఉందా? | Sakshi
Sakshi News home page

మీ అమ్మాయి ప్రేమలో ఉందా?

Published Fri, May 29 2015 10:13 PM

మీ అమ్మాయి ప్రేమలో ఉందా? - Sakshi

అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
ఒక వయసు తర్వాత కన్నార్పకుండా కాపాడుకుంటాం.
కళ్లు తెరచి ఉంచినా... గట్టిగా మూసుకున్నా రాలే కన్నీరుని ఆపలేం కదా.
ఈ జెట్ ఏజ్‌లో మంచీచెడు తేడా తెలుసుకునే వయసు రాకముందే
పిల్లలు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు... ప్రేమ పిచ్చిలో
చాలామంది గాయపడుతున్నారు.
దీనిని పెంపకంలో తప్పు అనుకోవడం తప్పు.
మీ ప్రేమ గొప్పదనం మీ జాగ్రత్తలోనే ఉంది.
బిడ్డను అర్థం చేసుకునే టైం మీకు ఉంటే... అంతా గుడ్ టైమే!

 
 ఆ అబ్బాయి, అమ్మాయి అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ ఒకరికొకరు విషయం చెప్పుకోలేదు.  కాలేజీలో కూడా చూపులే కలుపుకున్నారు. ఆ రోజు రాత్రి ఫోన్ చేసుకున్నారు. నువ్వు ముందు చెప్పు అంటే నువ్వు ముందు చెప్పు అని వంతులేసుకున్నారు. చివరికి ఆ అబ్బాయే మనసు విప్పాడు. ఇద్దరూ ఆ రోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. సడెన్‌గా వాళ్ల నాన్న వచ్చాడు. వెంటనే ఆ అమ్మాయి భయంతో ఫోన్ పక్కన పడేసింది.
 
ఇలాంటి సన్నివేశాలు మీ ఇంట్లో చూశారా..?  మీ  ఇంట్లో  అమ్మాయి ఇలాగానీ చేసిందా?
 
అమ్మాయి ఫోన్  కోసం అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో  అబ్బాయి నాన్న క్యారమ్స్ ఆడదాని రమ్మంటాడు. అయిష్టంగానే వెళ్తాడు. ఇంతలో ఫోన్ వస్తుంది. ఒకసారి... రెండోసారి... తండ్రి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి వెంటనే ఆగిపోతుంది. మూడోసారి కూడా అంతే...! అయినా నాలుగోసారి ఫోన్ రింగవగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటానికి పక్కకు వెళిపోతాడా అబ్బాయి. ప్రేమికుల మధ్య ఆ ఫోన్ రింగ్ ఓ కోడ్.
 
మీ ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మాయి విషయంలో ఇలాంటి రింగ్స్ వినబడ్డాయా...?
 మీ అమ్మాయి బయటెక్కడో కనపడిందంటూ హీరోయిన్ తండ్రికి, ఆయన మిత్రుడు చెబుతాడు. అమ్మాయిని అపురూపంగా పెంచిన తండ్రి విషయం తెలిసినా, తెలియనట్లే ‘ఎక్కడికెళ్లావమ్మా’ అని అడుగుతాడు. బాయ్‌ఫ్రెండ్‌తో కలసి బొంబాయికి విమానంలో వెళ్లి, క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి తిరిగొచ్చిన అమ్మాయి మాత్రం ‘ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నాన్నా’ అని అబద్ధం చెప్పేస్తుంది.
 
మీరు ప్రేమగా పెంచిన అమ్మాయి ఇలాంటి అబద్ధాలు ఎప్పుడైనా ఆడిందా?

 
అమ్మాయి ప్రేమలో పడితే..!
 ‘పడడం’ అనే మాట మన అమ్మాయి విషయంలో వాడబడడం.. వెరీ శాడ్. గొప్ప దుఃఖంలా ఉంటుంది. విషాదంలా కూడా! కోపాన్నీ, వైరాగ్యాన్నీ తెస్తుంది. అసలు ప్రేమన్న మాటకే మంటెత్తుతుంది. కానీ బిడ్డ. కన్నబిడ్డ. తెలియని వయసులో లేదు. తెలిసిన వయసులోనూ లేదు. తెలిసీ తెలియని వయసులో ఉంది. టీనేజ్ అన్నది మామూలుగానే మాట వినని వయసు. దానికి ప్రేమ కూడా కలిస్తే? మాట లెక్క చేయని వయసు.
     
ఎలా డీల్ చేయాలి?
డీల్ చేయడం కూడా ‘పడడం’లాంటి పెద్ద మాటే. కూతురేం కొరుకుడు పడని సమస్య కాదు. లౌక్యంగా డీల్ చెయ్యడానికి. ప్రేమగా హ్యాండిల్ చెయ్యాలి. తనని, తను ప్రేమను కూడా ఒడిసిపట్టుకోవాలి. జాగ్రత్తగా నడిపించాలి. దారి మరల్చాలి. కనిపించే పూలదారి ఆవలి ముళ్ల బాట గురించి చెప్పాలి. అమ్మానాన్నల మాటలు ముళ్లలా అనిపించవచ్చు. రేప్పొద్దున ముళ్లు గుచ్చుకోబోతుంటే ఆ అమ్మానాన్నల చేతులే చిన్నారి పాదాలకు రక్షణ అని అర్థమయ్యేలా తెలియజెయ్యగలగాలి. పెద్ద పని. కానీ మన చిన్నారి కోసం తప్పని పని.
 
అవి ప్రేమ లక్షణాలే!
కన్నబిడ్డను ఎలా అనుమానించడం? ‘‘నువ్వు గానీ ఎవర్నీ ప్రేమించడం లేదు కదా ’’అని ఎలా ప్రశ్నించడం? ప్రశ్నించనవసరం లేదు. పరీక్షించనవసరం లేదు. పరిశీలనా అవసరం లేదు. ఇవన్నీ చేస్తే అదేదో టెస్టులా ఉంటుంది. అలా వద్దు. చిన్న గమనింపు చాలు. నిజానికి గమనింపు కూడా అక్కర్లేదు. వాళ్లే వచ్చి కంట్లో పడతారు. పిల్లలు కదా. పసి హృదయాలు. పసి మనసులు.
 
ఎలా కాపాడుకోవడం?

ఈ ప్రశ్నకు సమాధానం సైకాలజిస్టుల దగ్గర ఉంది. ‘‘ప్రేమ వంటి సున్నితమైన విషయాలను తల్లిదండ్రులు తమ పిల్లలతో చర్చించడం అవసరం’’ అని ప్రముఖ సైకాలజిస్ట్ మేఘనా సింఘాల్ అంటున్నారు. ‘‘పిల్లలు ఏ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలని మనం కోరుకుంటున్నామో, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వ్యక్తిగత విషయాలను తల్లిదండ్రులతో చెప్పుకునే ధైర్యం, చొరవ పిల్లలకు వస్తుంది’’ అని ఆమె అంటారు.  ఇదే విషయాన్ని మరో సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ ఇంకో కోణంలో చెబుతున్నారు. ‘‘తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఆడపిల్లలకు ఉండాలి. ప్రేమకు స్నేహానికి మధ్య అంతరంపై వారికి అవగాహన కల్పించాలి’’ అని ఆయన అంటున్నారు.
 
మీ అమ్మాయి ప్రవర్తనలో గమనించవలసిన 10 మార్పులు

 
 1
 
ఏకాంతం : నలుగురితో కలిసి ఆడిపాడుతుండే పిల్ల, అల్లరి చేస్తుండే పిల్ల అకస్మాత్తుగా ఆటలు, పాటలు ఆపి, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంటే మనం ఆలోచించాలి. ప్రేమలో ఉన్నందు వల్లనే ఆమె ఆ ఏకాంతాన్ని కోరుకుంటుంటే కనుక అది ప్రమాదకరం. ఏకాంతం కాస్తా కొన్నాళ్లకి ఒంటరితనం అవుతుంది.
 
 2

తనలో తను నవ్వుకోవడం : దీనికి కూడా ప్రేమే కారణం అనుకోనవసరం లేదు. తనకేవో ఫ్రెండ్స్ జోక్స్ గుర్తుకురావచ్చు. ఆవే ళ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ని తను తలుచుకుని ఉండొచ్చు. అయితే ఈ నవ్వుకోవడం పరధ్యానంలోకి మారితే కనుక అమ్మాయిని బయట ఏదో శక్తి ఆకట్టుకుంటోందని, ఆకర్షిస్తోందనీ.
 
 3

ముస్తాబుకు ఎక్కువ సమయం : మామూలు గానే ఆడపిల్లలు ముస్తాబుకు కాస్త టైమ్ తీసుకుంటారు. ఆ కాస్త మరికాస్తై అది ఇంకాస్తై మాత్రం ఎవరి దృష్టిలోనో తను ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయపడుతున్నట్లు. ప్రేమలో ఉన్న అమ్మాయి తనో రాజకుమారిలా ఫీల్ అవుతుంది. వీలున్నంత వరకు అలా తయారయ్యేందుకు ప్రయత్నిస్తుంది.
 
4

ఫోన్ వస్తే పక్కకు వెళ్లిపోవడం : అవతలి నుంచి ఫోన్ రాగానే అమ్మాయి కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. వెంటనే ఉన్నచోటు నుంచి లేచి వెళుతుంది. అమ్మానాన్నలు వినకూడని మాటలు టీనేజర్‌కి ఏం ఉంటాయి! డెఫినెట్‌గా అది స్పెషల్ కాల్ అయ్యుంటుంది. అందుకే అంత గోప్యత.
 
5

రోజంతా టెక్స్ట్ మెసేజింగ్ : వేళ్లు నిరంతరం మొబైల్ లోని ఏబీసీడీ మీటల్ని నొక్కుతూనే ఉంటాయి. అటు నుంచి, ఇటు నుంచి ఎస్సెమ్మెస్‌లు పాస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలో ఉన్నవాళ్లు మాటల కంటే కూడా మెజేస్‌లను ఎక్కువ ఇష్టపడతారని ఎన్ని అధ్యయనాల్లో వెల్లడి కాలేదూ?!
 
6.

అన్యమనస్కం : ఏం చెబుతున్నా విననట్లే ఉంటారు. ఏదో ఆలోచిస్తుంటారు. ‘ఏం చెప్పావ్’ అని అడుగుతుంటారు. చెప్పిందీ సగం సగం వింటారు. తాము చెప్పదలచుకున్నదాన్నీ స్పష్టంగా చెప్పరు. వేరే మూడ్‌లోకి వెళ్లిపోతారు. కుటుంబ సభ్యులంతా ఒక టాపిక్‌పై మాట్లాడుతుంటే వీరు అందులోకి వెళ్లరు. తమ లోకంలో తాము ఉన్నట్లుంటారు.
 
7.

ఇల్లు కదలరు : కుటుంబ సభ్యులు ఫంక్షన్‌లకు, పరామర్శలకు వెళ్తుంటే వీళ్లు వెళ్లరు. రమ్మని అడిగినా, ‘నాకు ఒంట్లో బాగోలేదు మీరు వెళ్లండి’ అనో, ‘నేను చదువుకోవాలి’ అనో తప్పించుకుంటారు. ఇంట్లోనే ఉండిపోడానికి ట్రై చేస్తారు. అలాంటి ఏకాంతాన్ని ఇష్టపడతారు.
 
8

ఫ్రెండ్.. ఫ్రెండ్.. ఫ్రెండ్ : ఏం మాట్లాడినా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటుంటారు. ఫ్రెండ్‌కి వస్తానని చెప్పాను, ఫ్రెండ్స్‌తో కలిసి వెళుతున్నాను, కంబైన్డ్ స్టడీ కోసం ఫ్రెండ్ నన్ను రమ్మంది, షాపింగ్‌కు తోడుగా వెళ్లాలట.. ఇలా చెబుతుంటారు.
 
9

పాకెట్ మనీ : ఇది రెండు రకాలుగా జరుగుతుంది. రోజూ పాకెట్ మనీ అడిగే అమ్మాయి క్రమంగా అడగడం తగ్గించేస్తుంటుంది. లేదా మనీ సరిపోవడం లేదు ఎక్కువగా ఇమ్మని అడుగుతుంటుంది. అంటే పాకెట్ మనీ కోసం పట్టు పట్టరు. లేదా పట్టుపట్టి మరీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చే స్తుంటారు. ఇదీ ప్రేమ మహత్యమే.
 
10

ఆరాలు, అబద్ధాలు : ఇంట్లో ఉన్న అమ్మను, ఆఫీసుకు వెళ్లొచ్చే నాన్నను, బయట తిరుగుతుంటే అన్నదమ్ముల్ని టైమ్ టు టైమ్ వారి వేర్ అబౌట్స్ గురించి ఆరా తీస్తుంటారు. దాని ప్రకారం తమ టైమ్‌ని ప్లాన్ చేసుకుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇంట్లో తమకు సంబంధించిన వస్తువుల దగ్గరికి, పుస్తకాల దగ్గరికి, బట్టల దగ్గరికీ ఎవర్నీ రానివ్వరు. వీటికి తోడు అబద్ధాలు. ప్రతి విషయాన్నీ దాచేస్తుంటారు. అది బయటపడుతుందేమోనని అబద్ధాలు ఆడుతుంటారు.
 

Advertisement
Advertisement