ఏ సలహా ఇవ్వకపోవడం కూడా... సలహానే! | Sakshi
Sakshi News home page

ఏ సలహా ఇవ్వకపోవడం కూడా... సలహానే!

Published Mon, Jul 21 2014 10:53 PM

ఏ సలహా ఇవ్వకపోవడం కూడా... సలహానే!

తొలి పరిచయం
 
కెమెరా ముందు తొలిసారిగా నిల్చోవడానికి, తొలి సన్నివేశంలో నటించడానికి  ఇబ్బంది పడలేదు. భయపడలేదు. కారణం ఏమిటంటే, గతంలో  నేను చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించాను.
     
నేను షిల్లాంగ్‌లో పుట్టి పెరిగాను.  అక్కడ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా నేను ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ పెరిగాను. ‘టైటానిక్’ ‘ప్రెట్టీ ఉమన్’ నా అభిమాన చిత్రాలు. నేను చూసిన తొలి హిందీ సినిమా ‘కుఛ్ కుఛ్ హోతా హై’.
     
పోటీకి భయపడేవాళ్లు ఆటలో దిగవద్దు. దిగితే భయపడవద్దు. సినీ పరిశ్రమలోనే కాదు ప్రతిచోటా పోటీ ఉంది. ‘ఇతరులు ఏం చేస్తున్నారు?’ అనేదాని కంటే ‘నేనేం చేస్తున్నాను’ అనేదానిపైనే ఎక్కువ దృష్టి పెడతాను. షిల్లాంగ్ నేపథ్యం, సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి చిత్రం విజయం సాధించడం, నాకు గుర్తింపు రావడం... నావరకైతే అతిపెద్ద విజయాలు. ఈ సంతృప్తి చాలు.
     
కెరీర్ మొదట్లో లభించే ప్రశంసలు జీవితకాలం గుర్తుండి పోతాయి. ‘సిటీ లైట్స్’ ప్రదర్శన  తరువాత నటి అలియాభట్ నన్ను కౌగిలించుకొని  చాలాసేపు మెచ్చుకోలుగా మాట్లాడింది. నాకు స్ఫూర్తి కలిగించిన నటి విద్యాబాలన్ కూడా నన్ను మెచ్చుకున్నారు. షబానా ఆజ్మీ కూడా.  ఈ ప్రశంసలతో సంతోషం కంటే ‘బాధ్యత’ ఎక్కువ పెరిగింది.
     
‘కొత్తనటిని కదా. ఏదైనా సలహా చెప్పండి’ అని ఒక నటుడిని అడిగితే  ‘ఏ సలహా  ఇవ్వక  పోవడం కూడా సలహానే’ అన్నారు నవ్వుతూ. అంతేనేమో!
 
- పత్రలేఖ, హీరోయిన్ (సిటీలైట్స్ ఫేమ్)
 

Advertisement
Advertisement