అవినీతిపరుడికి అడిగే దమ్మెక్కడిది?

అవినీతిపరుడికి అడిగే దమ్మెక్కడిది? - Sakshi


చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

♦ ఇసుక నుంచి మద్యం వరకు అవినీతి విలయతాండవం

♦ ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కి వాటాలు

♦ కేసుల భయంతో ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టిన బాబు

♦ తన స్వార్థం కోసం ఐదుకోట్ల మంది జీవితాలతో చెలగాటం

♦ శ్రీకాకుళం యువ భేరిలో ప్రతిపక్షనేత విమర్శలు

 

 శ్రీకాకుళం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ర్టంలో అవినీతి విలయతాండవం చేస్తోంది. ఇసుక నుంచి మద్యం వరకు మాఫియాలు నడుస్తున్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు భారీఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. సీఎం ఆయన కొడుక్కి ముడుపులు చెల్లిస్తున్నారు. అలా సంపాదించిన అవినీతి డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు ఆ కేసుల మాఫీ కోసం ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టాడు. ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలతో అడుకుంటున్నాడు.



అవినీతిపరుడైనందునే ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీసి అడిగే దమ్మూ ధైర్యం ఆయనకు లేదు.’’ అని ఏపీ విపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పు లు చెరిగారు. శ్రీకాకుళంలోని టౌన్ హాలులో మంగళవారం విద్యార్థులు ఏర్పాటు చేసిన యువభేరి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘హోదా వస్తే పెట్టుబడుల కోసం ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు. పరిశ్రమలు తరలివస్తాయి ప్రతి జిల్లా ఓ హైద్రాబాద్ అవుతుంది. కానీ హోదాపై బాబు అబద్ధపు ప్రచారాలు సాగిస్తున్నాడు.’ అని జగన్ విమర్శించారు. జగన్‌మో హన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..



 ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?

 చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ర్టంలో 1,42,828 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు లేవు. పరీక్షల క్యాలెండర్ కూడా లేదు. ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో కూడా చెప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు వచ్చి హాస్టళ్లలో ఉండి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు.  తల్లిదండ్రులు పొలాలమ్మి డబ్బు పంపిస్తున్నారు. 22నెలలుగా కష్టపడుతున్నారు. 10వేల ఉద్యోగాల కోసం డీఎస్సీ పరీక్షలు జరిగాయి. దాదాపు 15నెలలయ్యింది. మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు.



పైగా క్లస్టర్ స్కూల్స్ పేరు చెప్పి స్కూళ్లను, హాస్టళ్లను తగ్గిస్తున్నారు. అంతేకాదు 7వేలమంది టీచర్లు అదనంగా ఉన్నారని రాష్ర్టప్రభుత్వం వార్తలు లీక్‌చేస్తోంది. బాబొస్తే జాబొస్తుందని ఇంటింటికీ తిరిగి చంద్రబాబు సంతకం ఉన్న పాంప్లెట్లు పంచారు. ఇంటికో ఉద్యోగమిస్తాం.. ఇవ్వలేకపోతే ఇంటికి రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు గానీ ఆయన హామీలు పేపర్లకే పరిమితమయ్యాయి. అబద్ధం, మోసం పునాదులుగా బాబు పాలన సాగుతోంది. ఓటేసిన వాళ్లు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడా అని ఎదురుచూస్తున్నారు.



మోసం చేసి ప్రజల భావోద్వేగాలతో, విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటే వాళ్ల ఉసురు తగులుతుందన్న విషయం చంద్రబాబుకు అర్థం కావాలి. అంగన్‌వాడీలు జీతాలు పెంచాలని ఆందోళన చేస్తే నిర్దాక్షిణ్యంగా కొట్టించి జైళ్లలో పెట్టించాడు. 35 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. రైతుమిత్రల ఉద్యోగాలు పోయాయి. ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయోనని రెండులక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు భయంభయంగా బతుకుతున్నారు. ఔట్‌సోర్సింగ్ మాత్రమే కాదు కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు. అవన్నీ నీటిమూటలుగా మిగిలిపోయాయి.



 హోదావస్తే ‘నోవేకెన్సీ’ బోర్డు ఉండదు

 ప్రత్యేక హోదా వల్ల మనకు రెండు మేళ్లు జరుగుతాయి. 1. రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న వనరుల్లో గ్రాంటు వాటా పెరుగుతుంది. గ్రాంట్ అంటే కేంద్రానికి తిరిగి చెల్లించనక్కర్లేని నిధులు. దాని వల్ల రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. 90శాతం కేంద్ర నిధులు గ్రాంటుగానూ, 10శాతం నిధులు రుణంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. హోదా లేకపోతే గ్రాంటుగా వచ్చేది 30శాతం నిధులు మాత్రమే. 70శాతం నిధులు కేంద్రానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 2. రాష్ర్టం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ రాయితీలు ఇస్తారు. దేశంలో ఇవాళ 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉంది.



ఈ రాష్ట్రాలలో పరిశ్రమ పెట్టేవారు ఆదాయపుపన్ను, కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదు. వస్తువులు రవాణా చేస్తే ఖర్చులు రీయింబర్స్ చేస్తారు. 20ఏళ్లపాటు 50శాతానికే కరెంటు సరఫరా చేస్తారు. ఇలాంటి రాయితీలు ఉంటే మన రాష్ర్టంలో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. పారిశ్రామిక వేత్తలను తీసుకురావడానికి చంద్రబాబు సింగపూర్, చైనా, దావోస్‌లకు వెళ్లక్కర్లేదు. మన రాష్ర్టంలో డబ్బులు పెట్టగలిగిన ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్త అవుతారు. పక్కరాష్ట్రాల నుంచి, పక్కదేశాల నుంచి వచ్చేవారు మనరాష్ర్టంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారు. జగన్ లేదా చంద్రబాబు ముఖం చూసి వారు పెట్టుబడులు పెట్టరు. మన రాష్ర్టంలో రాయితీలు ఉంటే పెట్టుబడులు పెడతారు. చంద్రబాబుకు ఈ విషయం తెలిసినా తెలియనట్లు నటిస్తున్నాడు. పరిశ్రమలు వస్తే వాటితో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు మనకు అందుబాటులోకొస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో నోవేకెన్సీ బోర్డు కనిపించదు. ఇక్కడ జాబులు ఉన్నాయి దరఖాస్తు చేసుకోండి అన్న బోర్డులు అడుగడుగునా కనిపిస్తాయి. ప్రత్యేకహోదా వల్ల ఉత్తరాఖండ్‌లో ఉద్యోగావకాశాలు 490శాతం పెరిగాయని బిజినెస్‌స్టాండర్డ్‌లో వచ్చిన కథనం చెబుతోంది.



 పార్లమెంటులో మాటకే గతిలేదా?

 మీకు ఇష్టంలేకపోయినా రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తున్నాం.. హైదరాబాద్ నగరాన్ని మీకు దూరం చేస్తున్నాం.. అందుకే మీకు ప్రత్యేకహోదా హామీ ఇస్తున్నాం అని ఆరోజు పార్లమెంటులో గొప్పగా చెప్పారు. 95శాతం ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. 70శాతం పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తామని నాటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీ పదేళ్లపాటు ఇస్తామని హామీ ఇచ్చాయి. ఎన్నికల సభల్లో బాబు, మోదీ స్పష్టంగా చెప్పారు. మేనిఫెస్టోల్లో పెట్టారు. ఇవాళ ఇదేదో కొత్త విషయమన్నట్లు మనచెవుల్లో పూలు పెడుతూ మనవైపు కొత్తగా చూస్తున్నారు. మనమంతా యువకులం. రాజకీయాల్లో విశ్వసనీయత కోసం చూస్తాం. ఒక నేత నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది నెరవేరుస్తాడని ఆశగా చూస్తాం. ఒక నమ్మకంతో ఎదురుచూస్తాం. అలాంటిది సాక్షాత్తూ పార్లమెంటులో ఇచ్చిన మాటకే గతి లేకపోతే ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా.

 

 హోదాపై బాబు అబద్ధాలు నమ్మొద్దు..

 ‘ప్రత్యేకహోదా వృథా, దానివల్ల ఉపయోగం లేదు, అది లేకున్నా మన రాష్ర్టం 11.77% అభివృద్ధితో దేశంకన్నా ముందుం ది’ అని బాబు చెబుతున్నాడు. ప్రత్యేకహోదాపై రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. 1. ఫైనాన్స్‌కమిషన్ ఒప్పుకోవడం లేదనేది అందులో ఒకటి. కానీ ఆ అధికారం దానికి లేదు. పన్నుల రూపంలో వచ్చే వనరులను రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలనేదే అది చూస్తుంది. ప్రణాళికేతర గ్రాంట్ల మీద, రుణాల మీద విధానపర నిర్ణయాలు ఎలా ఉండాలనే దానిని చూస్తుంది. 2. హోదా ఉన్న రాష్ట్రాలకు డబ్బులు తక్కువిస్తారనేది మరో అబద్ధం. దీన్ని చెబుతూ చంద్రబాబు ఏమన్నాడో తెలుసా.. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంత డబ్బు ఇవ్వాలనేదానికి ఒక ఫార్ములా ఏదీ లేదు. గత ఏడాది ప్రణాళికా మొత్తాన్ని ఈ ఏడాది ప్రణాళికా వ్యయాన్ని చూస్తారు. వాటి ఆధారంగానే డబ్బులిస్తారు.



ఈ మధ్య ప్రధాని మోదీగారు కాశ్మీర్ వెళ్లి రూ. 70వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 1.25 కోట్ల జనాభా ఉన్న కాశ్మీర్‌కి రూ. 70వేల కోట్లను ప్రకటిస్తే 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి ఎన్ని వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వవచ్చు? దానికి ఎవరు అడ్డుతగులుతారు? అని అడుగుతున్నా. 3. హోదా అనేది సమసిపోయిన అంశం.. ఏ రాష్ట్రానికీ హోదా అనేదే లేదని మరో అబద్ధం. ఇదే అంశంపై మా పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈశాన్యరాష్ట్రాల్లో ప్రత్యేకహోదా ఉందా అని కేంద్రమంత్రిని ప్రశ్నిం చారు. వాటికి హోదా కొనసాగిస్తున్నామంటూ కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ లేఖ ఉన్నపుడు ఏ రకంగా అబద్ధాలాడగలుగుతారు? ఎన్‌డీసీకి, నీతి ఆయోగ్‌కి చైర్మన్ ప్రధానే. ప్రధాని తలచుకుంటే హోదా క్షణంలో పని. ఆ విషయం బాబుకూ తెలుసు. కానీ బీజేపీని నిలదీయడు. ఎందుకంటే ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడడానికి.

 

 హోదాపై సమైక్యంగా పోరాడదాం

 ప్రత్యేకహోదాపై అందరూ అవగాహనను పెంచుకోవాలి. అప్పుడే కేంద్రమంత్రులను, చంద్రబాబును గట్టిగా నిలదీయగలుగుతాం. అపుడే మనకు న్యాయం జరుగుతుందన్నది మరచిపోకూడదు. ఇది కేవలం జగన్ వల్ల సాధ్యమయ్యేదికాదు. జగన్‌కు తోడుగా మీ అందరి అండదండలు ఉంటేనే అది సాధ్యమౌతుందని మరచిపోకూడదు. ప్రత్యేకహోదాపై విస్తృత సమాచారం ఇంటర్‌నెట్‌లో దొరుకుతోంది. వైఎస్సార్‌కాంగ్రెస్ వెబ్‌సైట్‌లోనూ ఉంది.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 

 అవినీతిపరుడు కాబట్టే బాబుకు భయం..


 చంద్రబాబు బీజేపీతో కొట్లాడే ధైర్యం చేయడు. దానికి కారణం ఆయన అవినీతే. రాష్ర్టంలో ఇసుకమాఫియా నడుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులే ఈ మాఫియాను నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మంత్రులకు, ముఖ్యమంత్రికి ఆయన కొడుక్కు నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు. లిక్కర్ మాఫియా, మద్యం మాఫియా నడుస్తోంది. ప్రభుత్వమే దగ్గరుండి కల్తీమద్యాన్ని సరఫరా చేస్తోంది. బెల్టుషాపులు రద్దుచేస్తామని చెప్పినోళ్లు ఇపుడు ఏకంగా బెల్టుషాపులకు వేలం పెట్టి మరీ మద్యం ఏరులుగా పారిస్తున్నారు. విజయవాడలో కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ ముఖ్యమంత్రి అధీనంలో నడుస్తున్నాయి.



బొగ్గు దగ్గర్నుంచి ఇసుక, మద్యం అన్నీ కుంభకోణాలే. కాంట్రాక్టర్ల కోసం జీవో 22 తెచ్చారు. అవసరం లేకపోయినా కాంట్రాక్టు మొత్తం పెంచి కాంట్రాక్టర్‌కి సగం, ముఖ్యమంత్రి సగం పంచుకుంటున్నారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితుల్లోకి రాష్ర్టం దిగజారిపోయింది. అన్ని విషయాల్లోనూ అవినీతే. ఇలా సంపాదించిన నల్లడబ్బుతో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ఎమ్మెల్యేకి డబ్బు సంచులు ఇస్తూ వీడియో, ఆడియో టేపుల్లో దొరికిపోయాడు. ఆ కేసుల నుంచి బైటపడడానికి నానా అగచాట్లు పడుతున్నాడు. అందువల్లే ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బీజేపీ ప్రభుత్వం నుంచి మంత్రులను వెనక్కి తీసుకుంటానని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేకుండా పోయాయి. ఇలా తన స్వార్థం కోసం ప్రత్యేకహోదాను, ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలను తాకట్టు పెట్టాడు. లంచాల కేసుల నుంచి బైటపడడం కోసం, మీ స్వార్ధం కోసం మా జీవితాలతో చెలగాటమాడడం అన్యాయం కదా అని చంద్రబాబును గట్టిగా నిలదీయండి.

 

 బలవంతంగా భూములు తీసుకోలేరు

 ఐకమత్యంగా న్యాయపోరాటం చేస్తే తుదివిజయం మీదే

 భోగాపురం ఎయిర్‌పోర్టు బాధితులకు జగన్ భరోసా


 భోగాపురం: ‘‘రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను ఎవరూ తీసుకోలేరు. అధైర్యపడవద్దు... తుది విజయం మీదే’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భోగాపురం ఎయిర్‌పోర్టు బాధిత రైతులనుద్దేశించి అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమానికి మంగళవారం జాతీయ రహదారి మీదుగా వెళుతున్న ఆయనకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఏ.రావివలస కూడలివద్ద పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్‌పోర్టు బాధిత రైతులు కలసి తమ ఆవేదనను ఆయన ముందుంచారు. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు చేస్తున్న న్యాయపోరాటానికి అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. రానున్న రోజుల్లో అంతా కలసి ఐకమత్యంగా న్యాయపోరాటం చేస్తే తుది విజయం మీదే అవుతుందన్నారు. ఎవరూ అధైర్యపడవద్దనీ, అండగా తానుంటానని భరోసా ఇచ్చారు.



 దివీస్ కాలుష్యంపై పోరాటం చేద్దాం : జగన్

 తగరపువలస: కాలుష్యం వెదజల్లుతూ భీమిలి తీరప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దివీస్ లేబొరేటరీ విస్తరణను అడ్డుకునేందుకు పోరాటం ఉధృతం చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం యువభేరిలో పాల్గొనేందుకు శ్రీకాకుళం వెళ్లిన ఆయన మార్గమధ్యంలో విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై తనకోసం వేచి ఉన్న దివీస్ బాధితులతో కొద్దిసేపు మాట్లాడారు. తాను కూడా ఈ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల జరుగుతున్న నష్టాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివీస్ కాలుష్యానికి కళ్లెం వేస్తామని’ భరోసా ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top