‘కార్డు’న్నా.. కటకటే.. | Sakshi
Sakshi News home page

‘కార్డు’న్నా.. కటకటే..

Published Wed, Jun 28 2017 4:19 AM

‘కార్డు’న్నా.. కటకటే.. - Sakshi

వాడే విధానం తెలియక రైతుల అవస్థలు
బ్యాంకులో డబ్బులున్నా తీయలేని పరిస్థితి
సాగు పెట్టుబడులకు చేతిలో డబ్బులేని వైనం
వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు

ఖమ్మంవ్యవసాయం: బ్యాంకింగ్‌ విధానాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వ్యవస్థలో వచ్చిన మార్పులు తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ కావడం.. వర్షాలు అనుకూలిస్తుండటంతో పల్లెల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దుక్కులు దున్నటం.. విత్తనాలు కొనుగోలు చేయడం వంటి పనులు చురుకుగా సాగుతున్నాయి. రైతులు ఈ సీజన్‌లో ఏ పని చేయాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. చేతిలో డబ్బులు లేకపోతే వ్యవసాయ పనులు సాగని పరిస్థితి.

గత ఏడాది పంట ఉత్పత్తులు అమ్మగా వచ్చిన నగదు.. అరకొరగా అందిన రుణమాఫీ డబ్బులు.. కొత్తగా వచ్చే పంట రుణాలు కూడా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. అయితే వ్యవసాయ పనులు, పెట్టుబడులకు నగదు అవసరం ఉండి.. బ్యాంకుకు వెళితే నగదు లేదని అధికారులు చెబుతున్నారు. నగదు రావడం లేదని, ప్రస్తుతం విధానం మారిందని తేల్చి చెబుతున్నారు. దీంతో తమ పనులు ఎలా కావాలని, సాగు పెట్టుబడులకు నగదు ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి క్రెడిట్‌ కార్డులను వినియోగించుకోవాలని, అంతకు మించి మరో మార్గం లేదని చెబుతున్నారు.

తమకు క్రెడిట్‌ కార్డు అంటే తెలియదని, అవి తమ దగ్గర లేవని చెబితే కార్డులు ఇస్తామని సమాధానం చెబుతున్నారే తప్ప నగదు మాత్రం ఇవ్వటం లేదు. ఇక సహకార బ్యాంకులు కూడా ఈ ఏడాది రూపే కార్డుల విధానాన్ని అమలు చేస్తుండగా.. ఆ బ్యాంకులు కూడా నగదు ఇవ్వని పరిస్థితి నెలకొంది. రూపే, క్రెడిట్‌ కార్డులున్నా ఏటీఎంలలో నగదు రావటం లేదు. గ్రామాలు, మండల కేంద్రాల్లో క్రెడిట్‌ కార్డు వినియోగించేందుకు పాస్‌ మిషన్లు లేవు.

విత్తనాలు వ్యాపారులు మాత్రం నగదు చెల్లిస్తేనే విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెబుతూ.. ఆ వి«ధానాన్నే పాటిస్తున్నారు. దీంతో రైతులు పాస్‌ మిషన్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మిషన్లలో క్రెడిట్‌ కార్డులను వినియోగించే విధానం తెలియక, బ్యాంకులో ఉన్న తమ నగదులో ఎంత ఖర్చవుతుందో..? ఎంత ఉందో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. దుక్కి దున్నే ట్రాక్టర్‌కు, చేలు, పొలాల్లో పనిచేసే కూలీలకు నగదు చెల్లించడం పెద్ద సమస్యగా మారింది. బ్యాంకులో నగదు ఉన్నా.. అన్నదాతలకు కొత్త విధానాలు అవస్థలకు గురిచేస్తున్నాయి.

డిజిటలైజేషన్‌ తెచ్చిన తంటాలు
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతోపాటు బ్యాంకింగ్‌ రంగంలో కూడా సమూల మార్పులు తెచ్చింది. నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి.. చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌ విధానంలో లావాదేవీలు చేపట్టాలని బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నగదు చెల్లింపులు లేకుండా.. కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే విధంగా మిషనరీ విధానాన్ని అమలు చేస్తున్నారు.

దీనిని అన్ని రకాల వ్యవస్థల్లో కూడా అమలు చేస్తున్నారు. కానీ.. వ్యవసాయ రంగంలో ఈ విధానం అమలుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విత్తన, ఎరువుల అమ్మకానికి వ్యాపారులకు పాస్‌ మిషన్లు, డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫట్‌ ట్రాన్స్‌ఫర్‌) మిషన్లను ఇచ్చి అమలు చేయిస్తున్నారు. అయినప్పటికీ వీటిని వ్యాపారులు పూర్తిస్థాయిలో వినియోగించటం లేదు. మిషన్లు ఉన్న ప్రాంతాల్లో విధానం తెలియక రైతులు నానా తంటాలు పడుతున్నారు.

ఎరువులు, విత్తనాల కొనుగోళ్లకు అవస్థలు
చేతిలో నగదు లేక, క్రెడిట్‌ కార్డు, రూపే కార్డు వినియోగం తెలియక ఎరువులు, విత్తనాలు కొనుగోలుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంలలో నగదు డ్రా చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలంటే ఏటీఎంలలో నగదు ఉండటం లేదు. ఇక ఆ కార్డులు పట్టుకుని దుకాణాలకు వెళితే కొన్ని దుకాణాల్లో పాస్‌ మిషన్లు లేకపోవటం, ఉన్న దుకాణాల్లో డ్రా చేసే విధానం తెలియక రైతులు కార్డులను వ్యాపారుల చేతిలో పెట్టాల్సి వస్తోంది.

చేతిలో నగదు లేని పరిస్థితి
వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడులు లేక కొందరు రైతులు అవస్థలు పడుతుండగా.. అరకొర రుణాల ద్వారా, గత ఏడాది పండించిన పంటల ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్న నగదు విడుదల కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కమీషన్, వడ్డీ వ్యాపారులకు పండగ
వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను, కమీషన్‌ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా బ్యాంకుల నుంచి తమకు కూడా నగదు రావటం లేదని చెబుతూనే రూ.3 నుంచి రూ.5 వడ్డీకి నగదును అప్పుగా ఇస్తున్నారు. తప్పని పరిస్థితిలో వ్యవసాయ పెట్టుబడులకు రైతులు అధిక వడ్డీలకు సైతం నగదును తీసుకుంటూ సాగు పనులు చేసుకోక తప్పటం లేదు.
కార్డు వాడకం తెలియట్లేదు..

ఎప్పుడు బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకొని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునే వాళ్లం. ఇప్పుడు బ్యాంకుకు వెళితే నగదు లేదంటున్నారు. అదేమంటే.. క్రెడిట్‌ కార్డు వినియోగించుకొని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. కార్డు వాడకం తెలియడం లేదు. కార్డు తీసుకొని ఓ దుకాణానికి వెళితే అవసరమైన విత్తనాలు లేవన్నారు. నగదు అవసరానికి దొరకక అప్పు చేసి.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశా.
– ఆలస్యం గోవిందరావు, రైతు, నేరడ, చింతకాని మండలం

కౌలు సాగు తగ్గించా..
ప్రతి ఏటా నా భూమితోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటా. కొందరి దగ్గర అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తూ.. పంటలు వచ్చాక తీర్చుతున్నా. ఈ ఏడాది అప్పిచ్చే వాళ్లు తమ వద్ద నగదు లేదని చెప్పారు. దీంతో కౌలు వ్యవసాయాన్ని తగ్గించా. పనులు చేయించడానికి నగదు సమస్య బాగా ఉంది.
– కంబాల నాగరాజు, రైతు, అమ్మపాలెం, కొణిజర్ల మండలం.

Advertisement
Advertisement