శ్రీమంతులు అటు వెళ్తే ... చుక్కలు చూపిస్తాడు | Sakshi
Sakshi News home page

శ్రీమంతులు అటు వెళ్తే ... చుక్కలు చూపిస్తాడు

Published Sun, Jan 31 2016 1:34 PM

శ్రీమంతులు అటు వెళ్తే ... చుక్కలు చూపిస్తాడు - Sakshi

ఏలూరు: గ్రామాలను దత్తత తీసుకోవడం.. సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.. నిరక్షరాస్యులైన పల్లె వాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం వంటి సత్సంకల్పాలు ఎప్పటినుంచో ఉన్నా.. ఇటీవల శ్రీమంతుడు సినిమాతో అటువంటి  ఔత్సాహికులకు క్రేజ్ ఏర్పడింది. ఊళ్లో అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించే విలన్లను ఆ సినిమాలో హీరో ఏరిపారేస్తాడు. ఆ సినిమా ముచ్చట ఎందుకంటే.. వాస్తవ ప్రపంచంలో అటువంటి ప్రతినాయకులను ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.

ఇందుకు జిల్లా కేంద్రం ఏలూరు సమీపంలోని కొన్ని గ్రామాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే ఉదాహరణ. ఊరిని బాగుచేయాలనే సత్సంకల్పం మెండుగా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నేత ఆగడాలకు, అరాచకాలకు భయపడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అటు వెళ్లే సాహసం చేయడం లేదు. సేవ చేయడం ద్వారా ప్రజల మన్ననలు అందుకుని వారు రాజకీయంగా ఎదిగిపోతారనే భయంతో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఎవరూ ఏ మంచిపని చేయకుండా అడ్డు తగులుతున్నారన్న వాదనలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం కొవ్వలి గ్రామానికి చెందిన
 
 
ఓ పారిశ్రామికవేత్త తాను నిర్వహిస్తున్న సంస్థ పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టపక్కల గ్రామాల ప్రజలకు ట్యాంకుల ద్వారా తాగునీటి పంపిణీ చేపట్టారు. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పన నిమిత్తం ఉచితంగా కుట్టుమెషిన్లు పంపిణీ చేశారు. అల్లికల్లో ఉచిత శిక్షణ ఇప్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించారు. 

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఆ సేవా కార్యక్రమాలకు అడుగడుగునా ఆటంకం కల్పించారు. తన మందీమార్బలంతో తాగునీటి పంపిణీకి అడ్డుకట్ట వేశారు. దీనిపై గ్రామస్తులు తిరగబడటంతో రూటు మార్చిన ఆ నేత అధికార బలాన్ని ఉపయోగించి సదరు పారిశ్రామికవేత్తను వేధించడం మొదలుపెట్టారు. ఇదంతా ఎందుకొచ్చిన గొడవని భావించిన ఆ పారిశ్రామిక వేత్త మొత్తంగా సేవా కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
 
 సేవ చేస్తామంటే చుక్కలు చూపిస్తాడు
 ఇదే రీతిన మరో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకూ ఆ టీడీపీ నేత చుక్కలు చూపించాడు. సంస్థ ప్రతినిధులు సొంత సొమ్ముతో నెలకొల్పిన తాగునీటి ప్లాంట్లను తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టిన ప్లాంట్లగా మార్చాలని వేధించాడు. మాట వినకపోవడంతో వాటిని మూయించివేశాడు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

చివరకు విసుగుచెంది కొన్ని గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఎత్తివేశారు. సేవ చేసేందుకు ముందుకొచ్చిన ఔత్సాహిక వ్యాపార వేత్తలు ఆ ఊళ్ల పేర్లు చెబితే భయపడిపోతున్నారు. ఒక్క ఊళ్లో ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్‌తో వచ్చే ఎన్నికల్లో ఆ పారిశ్రామికవేత్త ఎమ్మెల్యే అయిపోడు. కానీ.. ఆ ఊళ్లో చేసే మంచి పనులతో అతను క్రేజ్ సంపాదించుకుని ఓటు బ్యాంకుగా మారితే.. నిర్ణయాత్మకశక్తిగా రూపొందితే.. సేవ పేరుతో వచ్చి రాజకీయంగా ఎదిగి తనకు పోటీగా ఎక్కడ మారుతాడోనన్న చింతతో టీడీపీ నేత ఎప్పటికప్పుడు తాను భయపడుతూ.. ఎదటివాళ్లను భయపెడుతూ పైకి మాత్రం వంది మాగధులతో ‘టైగర్’ అని పిలిపించుకుని కాలక్షేపం చేస్తున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement