తీర్పు.....? | Sakshi
Sakshi News home page

తీర్పు.....?

Published Thu, Aug 10 2017 11:58 PM

తీర్పు.....? - Sakshi

అందరి చూపూ హైకోర్టు వైపు
కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికపై నిర్ణయం 16వ తేదీకి వాయిదా
ఇదంతా టీడీపీ పనేనని నగరవాసుల మండిపాటు


ఓటమి భయంతో ఇంత నీచ రాజకీయమా అంటూ ఆగ్రహం

రెండోసారి ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం కింది కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన రెండు డివిజన్లను వదిలేసి ఎన్నికలు నిర్వహించుకోవాలని హై కోర్టు చెబుతుందా?  

రెండు డివిజన్లను పెండింగ్‌ పెట్టడానికి, కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధం లేదని, ఫలితాలను యథావిధిగా ప్రకటించుకోవచ్చని  సూచిస్తుందా?
 
పెండింగ్‌లో ఉన్న రెండు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు తాజాగా నిర్వహించే 48 డివిజన్ల ఎన్నికల ఫలితాలను రిజర్వులో ఉంచాలని ఉటంకిస్తుందా...

మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలన్నది నిబంధన. ఈ లెక్కన ప్రస్తుతం జరుగుతున్న 48 డివిజన్లకుగాను నిబంధనల ప్రకారం 24 డివిజన్లు మహిళలకు కేటాయించాల్సింది. కానీ ప్రస్తుతం 23 డివిజన్లు మాత్రమే మహిళలకు రిజర్వు అయ్యాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తుందా?   

ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చాక ఎన్నికలు ఆపడం కుదరదని హైకోర్టు స్పష్టంగా ప్రకటించనుందా?

ప్రస్తుతం నిర్వహిస్తున్న సాంకేతికంగా సరికాదని, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఎన్నికలను వాయిదా వేస్తుందా?

సాక్షి ప్రతినిధి, :  కాకినాడ నగర ప్రజలను, రాజకీయ పక్షాలను తొలిచేస్తున్న సందేహాలివీ. కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలు నిలుపుదల చేస్తారా? కొనసాగిస్తారా? ప్రస్తుతం ఈ అంశం రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన నాటి నుంచి హైకోర్టులో గడచిన నాలుగైదు రోజులుగా లంచ్‌ మోషన్‌ పిటీషన్‌పై ఏరోజుకారోజు వాయిదాలు పడుతూ వాదనలు జరిగాయి. ప్రతిరోజూ తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. తాజాగా 16వ తేదీన తీర్పు వెలువరిస్తామని కోర్టు చెప్పడంతో నరాలు తెగే టెన్షన్‌ అటు పార్టీల్లోనూ, ఇటు అభ్యర్థుల్లోనూ నెలకొంది.

టీడీపీ విశ్వ ప్రయత్నాలు...
ఎన్నికలు నిలుపుదల చేసేందుకు గల సాంకేతిక కారణాలపై విస్తృత వాదనలు జరుగుతున్నాయి. ఈ పాత్రను ముఖ్యంగా అధికార పార్టీ నేతలు పోషిస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తేనే తమకు మంచిదన్న ఆలోచనతో టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. తమకున్న అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొని ఎన్నికల్లో గెలవడమంటే కష్టమనే అభిప్రాయంతో ఎన్నికలను ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి వాయిదా వేయించేందుకే చూస్తోంది.

ఒక్కొక్కరిదీ ఒక్కో వాదన...
  ప్రధానంగా కార్పొరేషన్‌ చట్టం ప్రకారం కనీసం 50 డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంటుందని అయితే ప్రస్తుతం 48 డివిజన్లకే ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ ఎన్నికకు భవిష్యత్తులో చట్టబద్దత ఉండదని, ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందన్న వాదన ఒకవైపు విన్పిస్తోంది. మరోవైపు 48 డివిజన్లలో ఎన్నికలు జరపాల్సిందిగా ఎలక‌్షన్‌ కమిషన్‌ రెండోసారి నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం కూడా లేదనే వాదన కూడా ఉంది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకుని మొత్తం ఎన్నికను వాయిదా వేయాలని తీర్పు ఇచ్చిన సందర్భాలు కూడా ఎప్పుడులేవని, దీనిదృష్ట్యా  ఎన్నికలు వాయిదా పడకపోవచ్చునని అంటున్నారు.

అధికారుల తప్పిదంతో కొత్త సమస్యలు...
విలీనం చేసిన మూడు పంచాయతీలకు సంబంధించిన మూడు గ్రామ పంచాయతీలపై కోర్టు స్టే కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని విలీనం చేసి ఎన్నికలకు సిద్ధంకావడం అధికారులు చేసిన  పెద్దపొరపాటుగా చెబుతున్నారు. కోర్టు స్టే తొలగకుండానే ఎన్నికలకు సిద్దమైన తీరే మొత్తం ఈ సమస్యకు ప్రధాన కారణమంటున్నారు. ఒక వేళ 48 డివిజన్లకు ఎన్నికలు జరిపి, మిగిలిన డివిజన్లు నిలుపుదల చేస్తే మరో కొత్త సమస్య కూడా వచ్చిపడే అవకాశం ఉంటుందంటున్నారు. వాయిదాపడ్డ డివిజన్ల నుంచి అభ్యర్థులు తమకు రాజకీయంగా అవకాశాలు కోల్పోయమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సమస్య మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

పరిష్కారం జరగాలంటే
ఒక వేళ సమస్య పరిష్కరించాలంటే ప్రస్తుతం ఉన్న 48 డివిజన్లను (విలీన పంచాయతీలను పక్కనపెట్టి) 50 డివిజన్లుగా విభజించి డీ లిమిటేషన్, వార్డుల పునర్విభజన పూర్తి చేసి మళ్ళీ ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇదంతా జరగాలంటే ప్రస్తుత ఎన్నికను వాయిదా వేసి మరో నెల నుంచి రెండు నెలలు కసరత్తు పూర్తి చేశాక మాత్రమే ఎన్నికలు జరిపే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. మరీ, ఈ వ్యవహారంలో కోర్టు ఎన్నికలకు సంబంధించి స్వతంత్రంగా ప్రకటిస్తుందా? ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ముందుకు వెళ్ళమంటుందా అన్న అంశమే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమవుతోంది.

Advertisement
Advertisement