అనుచితం | Sakshi
Sakshi News home page

అనుచితం

Published Fri, Apr 21 2017 11:33 PM

అనుచితం - Sakshi

- ‘ఉచిత ఇసుక’ ముసుగులో యథేచ్ఛగా దందా
-  ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో కర్ణాటకకు అక్రమ రవాణా
- ఇసుకాసురుల్లో అధికార పార్టీ నేతలే అధికం
- చోద్యం చూస్తున్న పోలీస్‌, రెవెన్యూ  


(సాక్షిప్రతినిధి, అనంతపురం)
    ఇసుక వ్యాపారం అధికార పార్టీ నేతలకు లాభసాటిగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతోందో, తద్వారా  ఆ పార్టీ నేతలు అనతి కాలంలోనే ఏ మేరకు ఆర్జించారో అందరికీ తెలిసిన సత్యమే. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుకరీచ్‌ల్లో పెత్తనం చేసి రూ.కోట్లు దండుకున్నారు. ‘ఇసుక మాఫియా’ వల్ల ప్రభుత్వానికి  చెడ్డపేరు రావడంతో విధిలేని పరిస్థితుల్లో  రీచ్‌లను రద్దు చేసింది. తర్వాత ఇసుకను ఉచితంగానే తీసుకెళ్లొచ్చని ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ దందా ఆగలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.  
            
ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఇసుక పాలసీని రూపొందించినప్పుడు జిల్లాలోని శింగనమల మండలం ఉల్లికల్లు, తాడిమర్రి మండలం చిన్నచిగుల్లరేవు, పెద్దపప్పూరు మండలం చిన్న ఎక్కలూరు రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. ఇవి ఏర్పాటైన మూన్నెళ్లలోనే ప్రభుత్వానికి రూ.2.57 కోట్ల  ఆదాయం వచ్చింది. అయితే.. ఇదే కాలంలో జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ప్రభుత్వానికి వచ్చిన దానికంటే ఐదు రెట్ల అధిక ఆదాయాన్ని పొందారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజూ రూ.10 లక్షల ఆదాయమే లక్ష్యంగా తవ్వకాలు సాగించారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా హాయిగా ఇంటికి చేరే సొమ్ము కావడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారు. ఇది శ్రుతిమించిపోవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం రీచ్‌లను రద్దు చేసింది.    

12 రీచ్‌లలో మాత్రమే అనుమతి
        ఉచితం అమలు చేసిన తర్వాత జిల్లాలో 12 రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రామగిరి మండలం పేరూరులో ఒకటి, కంబదూరు మండలంలో 4, బ్రహ్మసముద్రం మండలంలో 4, ముదిగుబ్బ మండలం పెద్దచిగుళ్లరేవు, కళ్యాణదుర్గం, కణేకల్లు మండలాల్లోని తమ్మసముద్రం, రాచేమర్రి రీచ్‌లకు అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడి నుంచి ఎవరైనా ఇంటి అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు. ఒక్కో ఇంటి వద్ద 4–5 ట్రాక్టర్ల ఇసుక నిల్వ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ నిల్వ ఉంటే అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేస్తారు. భారీ అపార్ట్‌మెంట్లు, ఇతర కట్టడాలకు ఇసుక అవసరమైతే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతించిన రీచ్‌లలో మాత్రమే తవ్వాలి. కానీ జిల్లాలోని అనుమతి లేని ఉల్లికల్లు, చిన్న ఎక్కలూరు, చిన్న చిగుల్లరేవుతో పాటు దాదాపు ఇసుక లభించే అన్ని ప్రాంతాల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. అయినా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.

3.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల తవ్వకానికి అనుమతి
12 రీచ్‌లలో 3,88,847 క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక తవ్వుకునేందుకు అనుమతిచ్చారు. ఈ ఏడాది జనవరి 28న భూగర్భ గనులశాఖ అధికారులు రీచ్‌లలో తనిఖీలు నిర్వహించారు. వారి లెక్క ప్రకారం అప్పటి వరకూ  42,500 క్యూబిక్‌ మీటర్ల మేర మాత్రమే తవ్వారు. అయితే.. అధికారులు నిర్ధేశించిన ప్రాంతాల్లోనే కాకుండా నదిలో ఇసుక లభ్యత ఎక్కడ ఉంటే అక్కడ తవ్వకాలు సాగించారు. దీన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.

భారీ ఆదాయం..
    రీచ్‌ల నుంచి దగ్గర్లోని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలకూ ఇసుక తరలిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జిల్లా నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. అక్కడ టిప్పర్‌ ఇసుక రూ.50వేలకు విక్రయిస్తున్నారు. భారీ వాహనాలైతే లోడు రూ.లక్ష వరకూ అమ్ముతున్నారు. ఈ లెక్కన రోజుకు పది లారీల ఇసుక తరలిస్తే చాలు అక్రమార్కుల పంట పండినట్లే! ఇసుక వ్యాపారుల్లో అధికార పార్టీ నేతలే అధికంగా ఉండటంతో అధికారులు  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికితోడు అధికారులు, పోలీసులను కూడా వారు ‘మంచి’గా చూసుకుంటున్నారు. దీంతో దందా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement