స్మార్ట్ కి స్టార్టింగ్ ట్రబుల్ | Sakshi
Sakshi News home page

స్మార్ట్ కి స్టార్టింగ్ ట్రబుల్

Published Sat, Jun 25 2016 1:30 AM

Kakinada as Smart City Mission in error!

* ప్రకటించి ఏడాదైనా ముందుకు కదలని పనులు
* నేడు కాకినాడలో ఆకర్షణీయ నగర వార్షికోత్సవం

 కాకినాడ : దేశవ్యాప్తంగా 100 నగరాలతో పోటీపడి తొలివిడత స్మార్‌‌ట సిటీ జాబితాలో స్థానం దక్కించుకున్న కాకినాడ ఆకర్షణీయ నగరం దిశగా అంతంతమాత్రంగా అడుగులేస్తోంది. మొదటి ఏడాదికి నిధులు విడుదలైనా, అవి చేతికి అందక పనులు నెమ్మదించాయి. స్మార్ట్‌సిటీ మిషన్‌ను ప్రకటించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా శనివారం ఆకర్షణీయ నగరాల్లో వార్షికోత్సవాలను జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా  కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది.
 
నిధులు చేతికందక..
తొలివిడత స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడకు ప్రభుత్వం రూ.376 కోట్లు దాదాపు మూడు నెలల క్రితమే విడుదల చేసింది. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా, మిగిలిన 50 శాతం కేంద్రవాటాగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల ఆ నిధులు చేతికి అందలేదు.

విడుదలైన స్మార్ట్‌సిటీ నిధులు ఖర్చు చేయాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతితో పీడీ అకౌంట్ ప్రారంభించాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాయగా  క్లియరెన్స్‌రాలేదని, అందువల్లే నిధులు ఇంకా జమకాలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య కొలిక్కి వచ్చి పనులు వేగవంతం చేస్తామని వారు చెబుతున్నారు.
 
సోలార్ పరికరాల ఏర్పాటు
స్మార్ట్ సిటీలో భాగంగా విద్యుత్ ఆదాచేసే క్రమంలో సోలార్ పరికరాల ఏర్పాటుకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.40కోట్ల విలువైన ఐదుమెగా వాట్ల విద్యుత్ పరికరాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. సుమారు 42 ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ-పాఠశాలలు ప్రారంభం
స్మార్ట్‌సిటీలో భాగంగా రామకృష్ణారావుపేటలోని మున్సిపల్ స్కూల్లో ఈ-పాఠశాలకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. కంప్యూటర్ ల్యాబ్స్, ప్రొజెక్టర్లు, ఆడియో, సీడీ, డీవీడీ, వీడియో ద్వారా విద్యాబోధన చేసేలా ఈ-పాఠశాలలకు శ్రీకారంచుడుతున్నారు. తొలివిడత ఒక పాఠశాలలో ప్రారంభిస్తున్నా, మలివిడత 23 స్కూళ్లల్లో ప్రవేశపెట్టనున్నారు.
 
హైజనిక్ స్టాల్స్
తోపుడుబళ్ల స్థానంలో హైజనిక్ ఫుడ్ వెండింగ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో దాదాపు 100 వరకు మెషీన్లను ఇక్కడ ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించి శనివారం వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
నేడు ప్రత్యేక సదస్సు
స్మార్ట్‌సిటీ తొలివార్షికోత్సవ సదస్సును శనివారం ఉదయం ఎస్‌ఆర్‌ఎంటీ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొననున్నారు.
 
వేగవంతంగా స్మార్ట్‌సిటీ పనులు
స్మార్ట్‌సిటీ దిశగా పనులన్నీ వేగవంతమవుతున్నాయి. తొలుత సోలార్ పరికరాల ఏర్పాటు, ఈ పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. ఆ తరువాత మిగిలిన పనులను వేగవంతం చేస్తాం. ఇప్పటికే  కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌గా రిజిష్టర్ చేయించాం.  అవసరమైన అన్ని ప్రతిపాదనలు ఒక్కొక్కటిగా వేగవంతం చేస్తాం.
- ఎస్.అలీమ్‌భాషా, కాకినాడ కమిషనర్

Advertisement
Advertisement