చక్రం తిప్పిన ఏపీఎం | Sakshi
Sakshi News home page

చక్రం తిప్పిన ఏపీఎం

Published Fri, Oct 21 2016 11:38 PM

చక్రం తిప్పిన ఏపీఎం

జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా రామసుబ్బమ్మ
52 మంది ఎంఎస్‌ అధ్యక్షుల హాజరు


అనంతపురం టౌన్‌ : వివాదాస్పదంగా మారిన ప్రశాంతి జిల్లా సమాఖ్య ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. అయితే కమిటీలోని ఓ కీలక స్థానం కోసం డీఆర్‌డీఏ–వెలుగులోని ఓ ఏపీఎం చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. వివరాలు.. జిల్లా సమాఖ్య ఎన్నికలు ఈనెల 5న నిర్వహించారు. 63 మంది మండల సమాఖ్య (ఎంఎస్‌)ల అధ్యక్షురాళ్లకు గాను 47 మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నా రు. మిగిలిన 16 మందిలో ఇద్దరు గైర్హాజరు కాగా 14 మందికి మండల స్థాయిలో పదవీ కాలం ముగియడంతో ఓటు హక్కు కల్పించలేదు. ఈ క్రమంలో కమిటీని ఎన్నుకున్నా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గ్రహించి చివరి నిమిషంలో రద్దు చేశారు. ఆ తర్వాత అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి.

మొత్తం 18 మంది నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మహిళా సంఘాలపై రాజకీయజోక్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఎంఎస్‌లకు మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టగా.. కొన్ని స్థానాల్లో ఏకగ్రీవం.. మరికొన్ని చోట్ల వాయిదా పడ్డాయి. మరికొన్నింటిలో ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఎన్నికలు నిర్వహించేందుకు సైతం అధికారులు సాహసించలేదు. ఈ నేపథ్యంలో వారికి ఓటు హక్కు కల్పించకుండా జిల్లా సమాఖ్య ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.  

ఎట్టకేలకు..
ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. చిత్తూరు జిల్లా సమాఖ్యకు చెందిన లీలారాణి, కల్యాణి ఎన్నికల పరిశీలకులుగా వచ్చారు. 63 మందికి గాను 8 మందికి ఓటు హక్కు కల్పించలేదు. పెద్దవడుగూరు సమాఖ్య వివాదం కోర్టులో నడుస్తున్నందున ఆమెకు కూడా ఓటు కల్పించలేదు. ఓటు హక్కు ఉన్న 54 మందిలో  పెద్దపప్పూరు, ముదిగుబ్బ మండల సమాఖ్య అధ్యక్షురాళ్లు రాలేదు. ఓ అధ్యక్షురాలు వచ్చినా వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయారు. దీంతో అధ్యక్ష స్థానానికి మినహా మిగిలిన స్థానాలకు 51 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

రామసుబ్బమ్మకే పట్టం
ప్రశాంతి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా ఈనెల 5న నిర్వహించిన ఎన్నికల్లో చెన్నేకొత్తపల్లికి చెందిన రామసుబ్బమ్మ ఎన్నికయ్యారు. అనంతరం ఆ కమిటీ రద్దయిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో కూడా ఆమే విజయం సాధించారు. అధ్యక్షురాలి బరిలో లక్ష్మీదేవమ్మ (ఆత్మకూరు), అంకాలమ్మ (యల్లనూరు), రామాంజినమ్మ (బుక్కపట్నం), నాగమ్మ (కుందుర్పి), రామసుబ్బమ్మ (సీకే పల్లి), పార్వతి (బత్తలపల్లి) పోటీలో నిలిచారు. రామసుబ్బమ్మ అత్యధికంగా 26 ఓట్లు సాధించి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.్ఞఅలాగే ఉపాధ్యక్షురిగా దిల్‌షాద్, కార్యదర్శిగా అంకాలమ్మ, సహాయ కార్యదర్శిగా వసంత, కోశాధికారిగా హేమలత గెలిచారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పార్వతమ్మ, కార్యదర్శి పార్వతి, సహాక కార్యదర్శి ఖుర్షీద్, డీపీఎం రామ్మోహన్, ఏపీఎం భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.   

ఏపీఎం దిశానిర్ధేశం
జిల్లా సమాఖ్య పాలకవర్గంలోని ఓ కీలక స్థానానికి సంబంధించి డీఆర్‌డీఏ–వెలుగులోని ఓ ఏపీఎం చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రే ఎన్నికలో ఎవరికి ఓటు వేయాలన్న దానిపై జిల్లాలోని కొందరు ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లకు దిశా నిరే్ధశం చేసినట్లు సమాచారం. దీంతో ఆయా మండలాల అధికారులు తమ సమాఖ్య అధ్యక్షురాళ్లకు విషయం చెప్పి ఎన్నికల ప్రక్రియలో ఆయన సూచించిన వారికి ఓటు వేసేలా జాగ్రత్తలు పడినట్లు తెలిసింది.

Advertisement
Advertisement