శ్రీకాకుళం జిల్లాలో నాట్స్ సేవా కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో నాట్స్ సేవా కార్యక్రమాలు

Published Mon, May 1 2017 5:00 PM

శ్రీకాకుళం జిల్లాలో నాట్స్ సేవా కార్యక్రమాలు - Sakshi

సామాజిక భవనానికి శంకుస్థాపన చేసిన నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ
త్వరలో  35 ప్రభుత్వ పాఠశాలల్లో బెంచీల ఏర్పాటు


కొండలోవగాం(శ్రీకాకుళం) :
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సేవా పరంపర కొనసాగిస్తోందని నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన మాట ప్రకారం మందస మండలంలోని కొండలోవగాంలో సామాజిక భవనాన్ని నిర్మించేందుకు నాట్స్ ముందుకొచ్చిందని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన మోహనకృష్ణ మన్నవ..కొండలోవగాంలో సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) సౌజన్యంతో మొక్కలు నాటే కార్యక్రమంలో నాట్స్ పాల్గొంది. అదే సమయంలో కొండలోవగాంలో గిరిజన భవనానికి తమ వంతు సహకారం అందిస్తామని నాట్స్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం రూ. 7.5 లక్షలతో నిర్మించనున్న ఈ గిరిజన భవనానికి నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ భూమిపూజ నిర్వహించారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.25 లక్షల వ్యయంతో నాట్స్ సిద్ధం చేయించిన బెంచీలను పరిశీలించారు.


సేవే గమ్యం అనేది  నాట్స్ నినాదమని.. దానికి తగ్గట్టే ఆర్ధికంగా వెనుకబడిన జిల్లాల్లో పాఠశాలలు దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నామని మోహన కృష్ణ మన్నవ వివరించారు. నాట్స్ సిద్ధం చేయించిన బెంచీలను త్వరలోనే  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పాఠశాలలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ, గ్లో సంస్థ అధ్యక్షురాలు గౌతు శిరిష, గ్లో సంస్థ కార్యదర్శి వెంకన్న చౌదరితో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement