ఆయన కంటే ముందే నేను చనిపోతాను | Sakshi
Sakshi News home page

ఆయన కంటే ముందే నేను చనిపోతాను

Published Tue, Nov 19 2019 11:10 AM

Wife Hanged Herself After Husband Illness - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నా భర్త మరణాన్ని జీర్ణించుకునే శక్తి నాకు లేదు.. ఆయన కంటే ముందే నేను చనిపోతా.. అంటూ తల్లికి ఫోన్‌ చేసి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం నారాయణపేటకు చెందిన సింధూజ(25), భర్త శివకుమార్‌తో కలసి రహ మత్‌నగర్‌లో అద్దెకుంటోంది. వారికి ఇద్దరు కొడుకులు. ఈ నెల 12న శివకుమార్‌కు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి  డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చిన శివకుమార్‌ తన భార్యకు చెప్పి ఇక తాను ఎక్కువ రోజులు బతకలేనేమోనని బాధపడ్డాడు.

మానసిక ఒత్తిడికి గురైన సింధూజ తన తల్లి రత్నాదేవికి ఫోన్‌చేసి ఏ క్షణంలోనైనా తన భర్త గుండెపోటుతో చనిపోవచ్చని ఆయన కంటే ముందే తానే చనిపోతానంటూ చెప్పి ఏడ్చింది. సముదాయించిన ఆమె ఆ తెల్లవారే కుమార్తె వద్దకు రావాలని అనుకున్నా రాలేక పోయింది. ఈలోపునే సింధూజ సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రత్నాదేవి సోమవారం ఉదయం వచ్చే సరికి ఆమె విగతజీవిగా కనిపించింది. తమ అల్లుడి ఆరోగ్యం విషయంలో మనస్తాపానికి గురైన తన కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement