భారీ ఒడిదుడుకులు! | Sakshi
Sakshi News home page

భారీ ఒడిదుడుకులు!

Published Mon, Jul 6 2015 2:32 AM

భారీ ఒడిదుడుకులు!

ప్రభావిత అంశాలు

♦ సోమవారం గ్రీసు రెఫరిండం ఫలితం
♦ గురువారం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు
♦ శుక్రవారం పారిశ్రామికోత్పత్తి డేటా
 
 ముంబై : గ్రీసు రిఫరిండం, కార్పొరేట్ ఫలితాలు, రుతుపవనాల గమనం ఈ వారం స్టాక్ మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే ఈ హెచ్చుతగ్గులు స్వల్పకాలమే వుంటాయని, పటిష్టమైన దేశీయ ఫండమెంటల్స్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నందున, తదుపరి మార్కెట్ మెరుగుపడుతుందని వారన్నారు. గ్రీసు రిఫరెండం ఫలితంగా ఈ వారం ప్రథమార్థంలో సూచీలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని జైఫిన్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నావ్గి చెప్పారు. తర్వాత దేశీయ అంశాలు మార్కెట్‌ను స్థిరపరుస్తాయని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రత్యేకించి భారత్‌పై గ్రీసు ఫలితం పెద్దగా ప్రభావం చూపబోదన్న ఆశాభావం మార్కెట్లో వుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు.

 నిఫ్టీ రేంజ్ 8,700-8,000
 గ్రీసు నుంచి సానుకూల ఫలితం వెలువడితే నిఫ్టీ 8,700 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుందని, ప్రతికూల ప్రభావం పడితే 8,000 స్థాయివరకూ తగ్గే అవకాశం వుందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ విశ్లేషించారు. గ్రీసు ఫలితం తర్వాత కార్పొరేట్ ఫలితాలు,  పారిశ్రామికోత్పత్తి గణాంకాల వైపు ఇన్వెస్టర్ల ఆసక్తి మళ్లుతుందని ఆయన అన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు ఫలితాల సీజన్ ఈ గురువారం మొదలవుతుంది. ఆ రోజున టీసీఎస్ క్యూ1 ఫలితాలు వెల్లడికానున్నాయి. జూలై 10న మే నెలకు పారిశ్రామికోత్పత్తి డేటా వెలువడుతుంది. అలాగే ఈ నెలలో రుతుపవనాల గమనం కూడా మార్కెట్‌కు కీలకమని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. జూలైలో వర్షపాతం తక్కువగా వుంటుందని వాతావరణ శాఖ అంచనావేయగా, సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ పేర్కొంది.

 గతవారం మార్కెట్
 ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల ఊతంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ వరుసగా మూడోవారం పెరిగింది. గతవారం 281 పాయింట్ల పెరుగుదలతో 28,093 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, కోల్ ఇండియా తదితర షేర్లు సెన్సెక్స్ పెరుగుదలకు దోహదపడ్డాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement