రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్

Published Sat, Nov 23 2013 12:45 PM

రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్ - Sakshi

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకున్న వైఎస్ జగన్, ఈరోజు మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5 పేజీల నివేదికను ప్రణబ్‌కు అందజేశారు.

రాష్ట్రాన్ని కేంద్రం అడ్డగోలుగా విభజించాలని చూస్తోందని ప్రణబ్‌కు చెప్పామని, భాషా ప్రయుక్త రాష్ట్రాలను 60ఏళ్ల తర్వాత ఇలా విభజించడం సరికాదని వివరించామని ఆ తర్వాత వైఎస్ జగన్ మీడియాకు తెలిపారు. ఈ రాష్ట్ర విభజన విధానం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే ప్రమాదముందని రాష్ట్రపతికి వివరించామని,
రాష్ట్రంలో నీటి సమస్యలు మరింత జటిలమవుతాయని ప్రణబ్‌కు చెప్పామని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 371(డి) గురించి కూడా ప్రణబ్‌కు వివరించామని, తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని వైఎస్ జగన్‌ చెప్పారు.

జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరారు.
 
అలాగే.. ఈరోజు  మధ్యాహ్నం జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా జగన్, ఇతర నేతలు కలిసి.. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ ఆదివారం రోజున జగన్ భువనేశ్వర్ వెళ్లి ఉదయం 11.30 గంటలకు బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకుంటారు.

Advertisement
Advertisement