టీడీపీకి చరమగీతం | Sakshi
Sakshi News home page

టీడీపీకి చరమగీతం

Published Wed, Aug 16 2017 4:23 AM

టీడీపీకి చరమగీతం - Sakshi

రూ.వందల కోట్ల సొమ్ముతో వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పండి
నంద్యాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ పిలుపు
జనజాతరను తలపించిన ఏడో రోజు రోడ్‌షో


సాక్షి బృందం, నంద్యాల : నంద్యాల ప్రజలు టీడీపీకి చరమగీతం పాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం  నంద్యాల పట్టణంలోని మూలసాగరం వద్ద నిర్వహించిన ఏడోరోజు రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబు పాలనను ఎండగట్టాలన్నారు. అధికారం చేపట్టి మూడున్నరేళ్లయినా గుర్తుకు రాని నంద్యాల అభివృద్ధి ..ఇప్పుడు గుర్తుకొస్తోందా అంటూ నిలదీశారు. ప్రజలను మోసగించడమే చంద్రబాబు నైజమని, ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి టీడీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

జనజాతర
ఏ వీధి, ఏ సందు, ఏ కాలనీలో చూసినా జనం కిక్కిరిశారు. ఎన్ని గంటలైనా జననేత రాక కోసం నిరీక్షించారు. తమ అభిమాన నేత కనిపించగానే కేరింతలు కొట్టారు. యువకులు, మహిళలు, వృద్ధులు..ఇలా అన్ని వయసుల వారు, అన్ని వర్గాల ప్రజలూ దారి పొడవునా పూలమాలలు వేస్తూ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటి నుంచి ప్రారంభమైన రోడ్‌షోలో అడుగడుగునా ప్రజలు పూల వర్షం కురిపించారు. కేవలం నాలుగు కి.మీ రోడ్‌షో పూర్తి కావడానికి 11గంటల సమయం పట్టింది. బొమ్మలసత్రం, నూనెపల్లె, బొగ్గులైన్‌ మీదుగా గాంధీనగర్, ఎస్సీకాలనీ, గాంధీనగర్‌ చౌరస్తా, రైల్వేట్రాక్, ఇస్లాంపేట, మూలసాగరం శివాలయం, విశ్వాసపురం, జ్ఞానాపురం, వైఎస్‌ ప్రభుదాస్‌రెడ్డి వీధి, పొగాకు కంపెనీ మెయిన్‌రోడ్డు, మూలసాగరం, విశ్వాసపురం, చిన్న చర్చి రోడ్డు, పెద్దచర్చి రోడ్డు వరకు రోడ్‌షో కొనసాగింది.

రైతులు బ్యాంకు గడప తొక్కలేని పరిస్థితి కల్పించారు
రోడ్‌షోలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. రైతుల రుణమాఫీ చేస్తానన్నారు. నేడు రుణమాఫీ జరిగిందా’ అంటూ ప్రశ్నించగా..  రైతులు ‘లేదు.. లేదు’ అని చేతులు ఊపుతూ సమాధానమిచ్చారు. రుణమాఫీ కాకపోవడం వల్లే నేడు రైతులు బ్యాంకు గడప తొక్కలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రుణమాఫీ కింద ఇచ్చిన మొత్తం వడ్డీకి కూడా సరిపోవడం లేదన్నారు.  మిర్చి మొదలుకొని ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. కేసీ కెనాల్‌కు నీరు లేక దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు.

చంద్రబాబు అందరినీ కొనాలని చూస్తున్నారు..
‘నంద్యాలలో రూ.వందల కోట్లతో చంద్రబాబు అందరినీ కొనేందుకు చూస్తున్నారు. కార్పొరేట్‌ మొదలు చిన్నాచితక కార్యకర్తల వరకు మీకు ఎంత రేటు కావాలంటూ ఎర వేస్తున్నారు. లీడర్లను ఎంతైనా రేటు ఇచ్చి కొనాలని చూస్తున్నారు. వీరు అవసరమైతే  బుజ్జగించడం లేదా కేసులు పెడతామని బెదిరిçస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు కూడా ఎర వేస్తూ కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఎందుకీ పరిస్థితి ఏర్పడిందంటే ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చనందున. పాలన పేరుతో విపరీతంగా అవినీతి చేస్తున్నారు కాబట్టి ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు మోసాలను ప్రజలు తిప్పికొట్టాల’ని పిలుపునిచ్చారు.

ఇలా..ఇలా..
‘ఇలా.. ఇలా..’ అని జగనన్న అంటూ ఉంటే రెండు చేతులూపుతూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించేటప్పుడు ప్రజల నుంచి పెద్ద స్పందన లభించింది. రుణమాఫీ జరిగిందా, లేదా అని అడగడంతో రైతులు, మహిళలు రెండు చేతులూ పైకెత్తి  ‘లేదు.. లేదు’ అంటూ సమాధానమిచ్చారు. ‘నిరుద్యోగ భృతి అందిందా? మీకు 38 నెలలుగా రావాల్సిన రూ.76 వేలలో ఒక్కరూపాయి అయినా చంద్రబాబు ఇచ్చారా?’ అంటే లేదని యువత నుంచి సమాధానం వచ్చింది. జగన్‌ తన ప్రసంగంలో భాగంగా చంద్రబాబు పాలనపై విమర్శ చేసిన ప్రతి సందర్భంలోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గాంధీనగర్‌లో మదారమ్మ అనే మహిళ తన భర్తకు అనారోగ్యం ఉందని తెలపడంతో వైఎస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లి ఆమె భర్త దస్తగిరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

నాలుగేళ్లుగా పక్షవాతం వల్ల తాను నడవలేని పరిస్థితిలో ఉన్నానని, పింఛన్‌ కూడా రావడం లేదని ఆయన తెలిపారు. మాజీ కౌన్సిలర్‌  బోయపుల్లమ్మ ఇంట్లోకి ఆహ్వానించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి జగన్‌ పూలమాల వేసి..అనంతరం ఆ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ ప్రభుదాస్‌రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  రోడ్‌షోలో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేతలు రాజగోపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, పీజే సునీల్,  చైర్‌పర్సన్‌ దేశం సులోచన, బుడ్డా శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement