కౌలు రైతుపై కరుణ ఏది? | Sakshi
Sakshi News home page

కౌలు రైతుపై కరుణ ఏది?

Published Thu, Aug 21 2014 1:27 AM

What is compassion sharecroppers?

  • రుణమాఫీపై పెదవి విప్పని సర్కార్
  •  జిల్లాలో మొత్తం 3.60 లక్షల మంది
  •  పడిపోయిన కౌలు రైతుమిత్ర గ్రూపులు
  •  మాఫీకోసం విజయవాడలో ధర్నా
  • కౌలు రైతులు తీసుకున్న రుణాలు రద్దవుతాయా, లేదా అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతుల కుటుంబానికి రూ. 1.50 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. స్పష్టంగా కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడంతో కౌలు రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
     
    మచిలీపట్నం : కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలంటూ రైతు సంఘాలు, ప్రజాసంఘాలు జిల్లాలో ఉద్యమాలు ప్రారంభించాయి. భూమి యజమానులు భూమికి సంబంధించిన పత్రాలను చూపి ముందస్తుగానే పంట రుణం తీసుకుంటున్నారు. ఒకసారి భూమిపై పంట రుణం తీసుకున్న తరువాత మళ్లీ కౌలురైతులకు సంబంధిత భూమి పత్రాలను చూపి రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు.

    కౌలురైతులకు పంట రుణాలు అందజేయాలనే లక్ష్యంతో 2010లో కౌలు రైతుమిత్ర గ్రూపులను ఏర్పాటు చేశారు. అప్పట్లో 28వేల కౌలు రైతుమిత్ర గ్రూపులను ఏర్పాటు చేశారు. రైతుమిత్ర గ్రూపుల్లో ఉన్న కౌలు రైతులు ఆరునెలల పాటు నెలవారి సొమ్ము సక్రమంగా చెల్లిస్తే వ్యవసాయాధికారులు బ్యాంకర్లను ఒప్పించి కౌలురైతులకు రుణాలు ఇప్పించారు. కౌలు రైతులు రుణాలు తీసుకునే సమయంలో పంట రుణం అని నమోదు చేసి ఉంటేనే రుణమాఫీ జరిగే అవకాశం ఉందని బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
     
    రుణాలు రద్దయ్యేనా

    జిల్లాలో 5.80 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 3.60 లక్షల మంది కౌలురైతులు ఉన్నట్లు అధికారుల అంచనా. 2010-11లో 28వేల కౌలురైతు మిత్ర గ్రూపులను వ్యవసాయాధికారులు ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్ల వ్యవధిలో కౌలురైతుమిత్ర గ్రూపులకు దాదాపు రూ. 150 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందేలా చర్యలు తీసుకున్నారు. కౌలురైతులు ప్రతి ఏడాది మారిపోవడంతో కౌలు రైతుమిత్ర గ్రూపులు 28వేల నుంచి 2వేలకు తగ్గిపోయాయి. ఈ రెండువేల గ్రూపుల్లోని దాదాపు 12వేల మంది కౌలురైతులు తాము తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తూ వస్తున్నారు.

    బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ. 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కౌలు రైతులకు సంబంధించిన రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి రూ. 15వేల కోట్లు కేటాయించగా దీనిలో పంటబీమా, రుణమాఫీ, పంట నష్టపరిహారం తదితరాలకు ఈ నగదును సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి బడ్జెట్‌పై మళ్లీ విశ్లేషణ చేసి ఎవరికి ఎంత నగదు కేటాయిస్తారో ప్రకటిస్తారని ప్రభుత్వం తెలిపింది.
     
    వ్యవసాయశాఖ మంత్రి చేసే ప్రకటనలో కౌలు రైతుల రుణాల రద్దు ప్రస్తావన ఉంటుందా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిందని ఈ ఉత్తర్వుల ప్రకారం త్వరలో  కలెక్టర్ అన్ని బ్యాంకుల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రుణమాఫీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు, బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కౌలు రైతులకు సంబంధించిన రుణమాఫీపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో 2014-15 ఆర్ధిక సంవత్సరంలో 1.24 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. వీరిలో ఎంత మంది కౌలురైతులకు  గుర్తింపుకార్డులు ఇస్తారు. ఎంత మందికి పంట రుణాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
     
    రుణమాఫీ కోసం కౌలు రైతుల ధర్నా


    విజయవాడ : ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు టీడీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేయాలని  రాష్ట్ర కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  ఖరీఫ్ సీజన్‌ప్రారంభమై రెండు నెలలు దాటిందని, ఆలస్యంగా కాలువలు వదలడంతో ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కౌలు రైతులు,చిన్న సన్నకారు రైతులకు తక్షణం పెట్టుబడులు అవసరమన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణమాఫీని అమలు చేసి ఖరీఫ్ రుణాలు ఇప్పించకపోతే రైతులు అధిక వడ్డీకి ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. జీవోలో  చెప్పిన విధంగా పెట్టుబడి రుణాలుగా పరిగణిస్తే కౌలు రైతులు, సన్నకారు చిన్నకారు రైతులు నష్టపోతారని వివరించారు.  

    కౌలు రైతులకు ఎల్‌ఇసి, కార్డులు ఇవ్వడం, పంట రుణాలు ఇచ్చే ప్రక్రియను ఎప్పటికప్పుడు అజమాయిషీ కోసం జిల్లా, మండలస్థాయిలో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం  కలెక్టర్‌కు క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.  ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వై. కేశవరావు,, కార్యదర్శి జె.ప్రభాకర్, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ టి.వి.లక్ష్మణస్వామి, కో-కన్వీనర్ ఎన్.నాగేశ్వరావు, చెరుకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.హరిబాబు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement