రూ. వేల కోట్ల హవాలా! | Sakshi
Sakshi News home page

రూ. వేల కోట్ల హవాలా!

Published Tue, May 16 2017 3:47 AM

రూ. వేల కోట్ల హవాలా! - Sakshi

విశాఖ హవాలా కుంభకోణంపై సీఐడీ అంచనాలు
►  ఇందులో బడాబాబులు, బ్యాంకర్ల పాత్ర


సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా వందల కోట్లకే పరిమితమైందనుకుంటున్న విశాఖలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం విలువ రూ.వేల కోట్లు ఉంటుం దని ఏపీ  సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్‌ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రక్రియ మొదలయింది. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ను సోమవారం ఉదయం కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించారు. మహేష్‌ను కస్టడీకి తీసుకొని విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

ఏపీ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం!
మహేష్‌ తండ్రి శ్రీనివాసరావే కొడుకును ఇందులో సూత్రధారులకు పరిచయం చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మరోవైపు గోయల్, గోయంకా, గుప్తా అనే హవాలా వ్యాపారులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. ఈ కేసును ఛేదించేందుకు సీఐడీ అధికారులు సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుల సాయాన్ని తీసుకోనున్నారు. నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపైనా సీఐడీ దృష్టి సారించనుంది. ఈ కంపెనీల సంబంధిత డైరెక్టర్లను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని సీఐడీ భావిస్తోంది. మరోవైపు ఈ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉందన్న వీరు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటిదాకా రూ.1,369 కోట్ల హవాలా కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చినా మున్ముందు ఇది వేల కోట్లకు చేరుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోవచ్చని అంటున్నారు.  

12 కంపెనీలు.. 30 ఖాతాలు
హవాలా కుంభకోణంలో 12 బోగస్‌ కంపెనీలను సృష్టించారని, 30 బ్యాంకు ఖాతాలను తెరిచారని, నకిలీ పాన్‌కార్డులు, డాక్యుమెంట్లను రూపొందించి మోసానికి పాల్పడ్డారని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ చెప్పారు. ఆయన సోమవారం కమిషనరేట్‌లో విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు మహేష్‌ ఆయా కంపెనీల ఉద్యోగులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి హవాలా సొమ్ముతో రూ.680.94 కోట్ల లావాదేవీలు నిర్వహించారని తెలిపారు. ఈ కంపెనీలు రూ.569.93 కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాన్ని భారత్‌కు నష్టం కలిగించాయని చెప్పారు. అంతేగాక.. కోల్‌కతా బ్యాంకుల్లో మరో రూ.800 కోట్ల సొమ్మును జమ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారన్నారు. 2014 నుంచి మొదలైన ఈ వ్యవహారం పెద్దనోట్ల రద్దు వరకు వేగంగా సాగిందన్నారు. సమావేశంలో డీసీపీ నవీన్‌ గులాటీ, స్పెషల్‌ బ్రాంచి ఏడీసీపీ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement