రబీ వరిపై గిరి రైతుల దృష్టి | Sakshi
Sakshi News home page

రబీ వరిపై గిరి రైతుల దృష్టి

Published Tue, Jan 14 2014 2:13 AM

Varipai Rabi Giri offense

అరకులోయ, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో గిరిజన రైతులు రబీ వరి సాగుపై దృష్టి సారించారు. మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో వ్యవసాయ, వాణిజ్య పంటల్ని కోల్పోయిన గిరిజన రైతులు ఈ ఏడాది కరువు బారి నుంచి తప్పించుకునేందుకు వీలుగా రబీని ఎంచుకున్నారు. కొన్ని పంచాయతీల్లోని గ్రామాల్లో సాగు నీరు అనుకూలంగా ఉండటంతో ఇదే అదనుగా భావించి విస్తారంగా సాగు చేపట్టారు. బస్కీ, లోతేరు, మాడగడ, చొంపి, కొత్తభల్లుగుడ, గన్నెల, పెదలబుడు సుంకరమెట్ట పంచాయతీల గిరిజన రైతులు విస్తారంగా రబీ సాగుకు భూములను సిద్ధం చేస్తున్నారు. ముందుగా నారు పోసిన గిరిజనులు కొన్ని గ్రామాల్లో ఉడుపులను ప్రారంభించారు.

అరకులోయ మండలంలో వెయ్యి ఎకరాలకు పైగా వరి సాగు చేస్తున్నట్లు స్థానిక వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈఏడాది రబీ పంటలకు వాతావరణం కూడా అనుకూలంగా ఉండవచ్చని వారంటున్నారు. డుంబ్రిగుడ మండలంలో 503 ఎకరాల్లో, అనంతగిరి మండలంలో 700 ఎకరాల వరకు రబీ వరి సాగుకు అనువైన భూములున్నాయని అరకు వ్యవసాయశాఖ సిబ్బంది తెలిపారు.

తుపానులో పంట నష్ట పోయిన గిరిజన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా వరి విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తే మరికొందరు వరి సాగు చేసే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. చలిని తట్టుకునే ఐఆర్ 64, ఎంటీయూ 1010 రకం వరి విత్తనాలను నారపోసి సాగు చేస్తే దిగుబడి బాగుంటుందని అరకులోయ వ్యవసాయ శాఖ ఏడీ పద్మారావు సూచించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement