ఓర్వలేని రాతలు | Sakshi
Sakshi News home page

ఓర్వలేని రాతలు

Published Thu, Feb 11 2016 11:51 PM

Town Hall chairman Challa Balakrishna

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని టౌన్‌హాల్ ఎవరి సొత్తూ కాదని, అది ట్రస్ట్‌కు చెందిన స్థలమని టౌన్‌హాల్ చైర్మన్ చల్లా బాలకృష్ణ స్పష్టం చేశారు. టౌన్‌హాల్ భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని నెలకు రూ.50వేలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అద్దెకిచ్చామన్నారు.  ఇందుకు మిగతా సభ్యులు కూడా అంగీకరించారన్నారు. వైఎస్సార్‌సీపీ టౌన్‌హాల్‌ను సుందరీకరించడం, ఇటీవల యువభేరి కార్యక్రమం విజయవంతం కావడం చూసి ఓర్వలేక టీడీపీ నేతలు తమ అనుకూల పత్రికల్లో టౌన్‌హాల్‌కు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చల్లా బాలకృష్ణ గురువారం సాక్షితో మాట్లాడారు. ఓ పత్రికలో వచ్చిన కథనంపై చల్లా మాట్లాడుతూ టౌన్‌హాల్ స్థలం టౌన్‌హాల్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట నడుస్తోందన్నారు. గతంలో కూడా పలు విద్యాసంస్థలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, క్రీడా పోటీల నిర్వహణకు, రాజకీయపార్టీలకు ఇచ్చామన్నారు.  
 
 1883లోనే కొనుగోలు
 టౌన్‌హాల్ స్థలాన్ని 1883 జూన్ 21, 22వ తేదీల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పట్లో పెద్దలు కొనుగోలు చేశారని, 1926 సెప్టెంబర్ 14న సొసైటీగా మార్పుచేశారన్నారు. 1969లో తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే చల్లా లక్ష్మీనారాయణ టౌన్ హాల్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి పనులు చేయించారన్నారు.  టౌన్‌హాల్‌లో సామగ్రి పలువురు దాతలిచ్చారన్నారు. 2004లో తనను సభ్యులంతా ఏకగ్రీవంగా అసిస్టెంట్ సెక్రటరీగా ఎన్నుకున్నారని, తన తండ్రి చేసిన సేవలకు మిగతా సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే పలు పదవులిచ్చారని చల్లా చెప్పారు.
 
  ఆ కథనం అవాస్తవం
 టౌన్‌హాల్ సొసైటీ 2006, జూలైలో ట్రస్ట్‌గా మారిందని, 1.42సెంట్ల భూమిలో అభివృద్ధి పనుల నిమిత్తం ఏడు సెంట్ల స్థలాన్ని విక్రయించామని చల్లా తెలిపారు. ఐదేళ్ల లీజుకు వైఎస్సార్‌సీపీకి మిగతా స్థలాన్ని ఇచ్చామని, ఐదేళ్ల తరువాత మూడు నెలల ముందు నోటీసుతో వాళ్ల బాధ్యతలు తీరిపోయేలా అగ్రిమెంట్ రాయించుకున్నామన్నారు. ఏడుగురు సభ్యులున్న ట్రస్ట్‌లో అందరి అంగీకారం మేరకే వైఎస్సార్‌సీపీకి ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఇక్కడి విద్యుత్ మీటర్‌కు నెంబర్-1గా సర్వీసు ఇచ్చారని, అదీ కూడా ట్రస్ట్‌పేరుమీదే నడుస్తోందన్నారు.
 
 భవిష్యత్‌లో ఇబ్బందుల్లేకుండా, టౌన్‌హాల్ ట్రస్ట్ నిర్వహణ భారం లేకుండా ఉండేందుకే ఆ ప్రాంగణాన్ని వైఎస్సార్‌సీపీ ఇచ్చామన్నారు. చల్లా కుటుంబంలోనే ఇది నడుస్తోందన్నది కూడా అవాస్తవమేనని, ఈనాడులో వచ్చిన కథనం పూర్తి అవాస్తవమన్నారు. ఇది బహిరంగంగా వచ్చి చెప్పమన్నా చెబుతానని, 2007లో తాను టౌన్‌హాల్ ట్రస్ట్ గూర్చి మీడియాకు చెప్పిన పత్రికా కథనాలు కూడా భద్రంగా ఉన్నాయన్నారు. ఈనాడు కూడా ఇదే విషయాన్ని అప్పట్లో ట్రస్ట్ కింద రాసి ఇప్పుడు ప్రజల సొత్తు అని రాయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. రూ.150 కోట్లు విలువైన స్థలం పరుల చేతికి వెళ్లిపోతుందని వార్తలు రావడంపై ఆయన మండిపడ్డారు. రూ.50 కోట్లయినా విలువ చేయని స్థలాన్ని రాజకీయ కక్షలతో విలువ పెంచడం భావ్యం కాదన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్వహణ ఖర్చుల కోసమే వైఎస్సార్‌సీపీకి ఇవ్వడం జరిగిందన్నారు. ఓ కల్యాణమండపం కట్టి, దాని ప్రారంభోత్సవానికి చంద్రబాబును పిలిస్తే ఆ సొత్తు చంద్రబాబుది అయిపోతుందా అని ఎద్దేవా చేశారు.
 

Advertisement
Advertisement