తీగలాగితే డొంక కదిలింది! | Sakshi
Sakshi News home page

తీగలాగితే డొంక కదిలింది!

Published Mon, Sep 1 2014 4:14 AM

Tigalagite moved into action!

  •      గంగవరం పోలీసుల అదుపులో దొంగనోట్ల ముఠా సభ్యుడు
  •      రూ.పది లక్షల దొంగనోట్లు స్వాధీనం
  •      ఇది కర్ణాటక ముఠా పనేనని పోలీసుల అనుమానం
  •      చురుగ్గా విచారణ
  • పలమనేరు: ఓ కేసు విషయమై ఒక వ్యక్తిని పోలీసులు విచారించగా మరో కొత్త విషయం వెలుగుచూసింది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇతని ద్వారా ఓ దొంగనోట్ల ముఠా బయటపడింది. నిందితుడిచ్చిన సమాచారంతో గంగవరం పోలీసులు ఈ ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల దాకా దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన ఓ బడా గ్యాంగ్ ఈ దొంగనోట్లను చెలామణి చేస్తున్నట్లు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం దొరికింది.

    ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక రాష్ర్టంలో గంగవరం సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇన్నాళ్లుగా ఈ ప్రాంతంలో దొంగనోట్ల చెలామణి భారీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ముఠా పోలీసులకు చిక్కినట్లయితే దీని వెనుక ఎవరున్నారు? అసలీ వ్యాపారం ఎప్పటి నుంచి సాగుతోంది? అసలు దొంగనోట్లు వీరికి ఎక్కడ నుంచి వస్తున్నాయి? అనే కీలకమైన సమాచారం లభించే అవకాశాలున్నాయి.
     
    నిందితుడు ఎలా చిక్కాడంటే..
     
    గంగవరం మండలం దండపల్లెకు చెందిన దీపశిక వీఆర్‌ఏగా పనిచేస్తోంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన అంజలి ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని కప్పలమడుగుకు చెందిన మంజునాథ్ పరిచయమయ్యాడు. అతను తరచూ దండపల్లెకొచ్చి దీపశికతో మాట్లాడి వెళుతుండేవాడు. మంజునాథ్ తీరుపై అనుమానమొచ్చిన గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారమందించారు. అతన్ని గంగవరం పోలీసులు విచారించారు.

    అతను చెప్పే విషయాలు పొంతన లేకుండా ఉండడం, అతని వద్ద నాలుగు రూ.500 దొంగనోట్లు దొరకడంతో విచారణ ప్రారంభించారు. తనవద్ద మరో రూ.10 లక్షల దాకా దొంగనోట్లు ఉన్నాయని ఒప్పుకున్నట్లు తెలిసింది. అతనిచ్చిన సమాచారం మేరకు కర్ణాటకలోని కప్పలమడుగులో పోలీసులు రూ.10 లక్షల దొంగనోట్లను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

    తనకు తమ గ్రామానికే చెందిన బాబు అనే వ్యక్తి ఇచ్చి చెలామణి చేయించాలని చెప్పాడని నిందితుడు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక అసలు ముఠా గుట్టురట్టు చేసేందుకు గంగవరం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై గంగవరం సీఐ రామకృష్ణను వివరణ కోరగా మంజునాథ్‌ను అదుపులోకి తీసుకున్న మాట నిజమేనని, పూర్తి స్థాయిలో ఈ ముఠాను పట్టుకున్నాక వివరాలను తెలుపుతామని అన్నారు.
     

Advertisement
Advertisement