ఇదేనా... యాంత్రీకరణ? | Sakshi
Sakshi News home page

ఇదేనా... యాంత్రీకరణ?

Published Fri, Jul 31 2015 2:05 AM

This is the mechanism?

వ్యవసాయంలో యాంత్రీకరణకు అక్కడ అధికారులే తూట్లు పొడుస్తున్నారు. రైతులకు సబ్సిడీపై పరికరాలు అందివ్వడంలో విఫలమవుతున్నారు. కలుపునివారణకు వినియోగించే స్ప్రేయర్లకోసం సబ్సిడీ మొత్తాలు సిద్ధంగా ఉన్నా వాటిని అందివ్వలేకపోతున్నారు. ఇదే అదనుగా అన్నదాతల అవసరాన్ని ప్రైవేటు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.
 
 గార : జిల్లా రైతాంగానికి కలుపునివారణ కష్టంగా మారుతోంది. దీనికోసం వినియోగించాల్సిన సబ్సిడీ స్ప్రేయర్ల సరఫరాలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా ఎక్కువ మొత్తాలతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేంద్రప్రభుత్వం ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. రాష్ట్ర వ్యవసాయ సాధారణ ప్రణాళిక, జాతీయ ఆహార భధ్రతా మిషన్ వంటి పథకాల కింద రైతులకు ఆధునిక పరికరాలు 50 శాతం రాయితీపై ఇచ్చేందుకు జిల్లాలో సుమారు రూ. 15 కోట్లు ప్రస్తుతం సిద్ధంగా ఉంది. వాటిలో పవర్, సాధారణ స్పేయర్లకు 50 శాతం రాయితీ ఇచ్చేందుకే రూ. కోటి వినియోగించుకోవచ్చు. గతేడాది స్పేయర్లు పంపిణీ చేసిన కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 శాతం రాయితీని ఇంతవరకు జమచేయలేదు. దీంతో ఈ ఖరీఫ్‌కు కావాల్సిన స్పేయర్లు కంపెనీల వద్ద అందుబాటులో ఉన్నా జిల్లాకు మాత్రం పంపించేందుకు ససేమిరా అంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రాయితీలేకుండానే ప్రైవేటు డీలర్ల వద్ద రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా డీలర్లు ఒక్కో స్పేయరుపై రూ. 200 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.
 
 కలుపునివారణకు స్ప్రేయర్లు తప్పనిసరి
 ఖరీఫ్ సీజన్‌లో వరి పంటలో కలుపు నివారణకు సాధారణంగా ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి ఉంటుంది. పెరిగిన తరువాత తొలగించాలంటే కూలీలకోసం దాదాపు రూ. ఆరువేలకుపైబడి ఖర్చుపెట్టాలి. అయితే కలుపుమందులు ముందుగానే చల్లేస్తే కేవలం వెయ్యిరూపాయలతో నివారించుకోవచ్చు. అయితే ఈ మందు పిచికారీ చేస్తేనే కలుపు నివారణ సాధ్యమవుతుంది. ఇందుకోసం పవర్, సాధారణ స్ప్రేయర్లను ఎవరి శక్తిని బట్టి వారుకొనుగోలు చేస్తారు. సాధారణ స్ప్రేయర్లయితే రూ. 1800 నుంచి రూ. 3000 వరకూ లభ్యమవుతుండగా, పవర్ స్ప్రేయర్లు రూ. 2000 నుంచి 30వేల వరకూ లభ్యమవుతున్నాయి. అన్నింటికీ యాభైశాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా అవిరైతులకు ఉపయోగపడటంలేదు. జిల్లాలో లక్షా 50 వేల ఎకరాల్లో 70వేల మంది రైతులు ఎద సాగు చేస్తున్నారు. కానీ వీరందరికీ జిల్లాలో కేవలం 5వేల స్ప్రేయర్లే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెద జల్లిన మూడు రోజుల నుంచి కలుపు మందు పిచికారి చేయాలి. అందరూ ఒకేసారి స్పేయర్లు కావాలనుకోవడం, ప్రభుత్వం రాయితీపై అందుబాటులో ఉంచకపోవడంతో సమస్య ఏర్పడింది.
 
 గత ఏడాది లెక్కతేలకే మూలుగుతున్న సబ్సిడీ
 జిల్లాలో స్ప్రేయర్ల పంపిణీపై వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ అప్పలస్వామి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గతేడాది స్ప్రేయర్లు ఎన్ని ఇచ్చారో కంపెనీలు రాతపూర్వకంగా తమకు ఇవ్వకపోవడంవల్లే సబ్సిడీ జమచేయలేకపోయామని తెలిపారు. సాధారణ స్ప్రేయర్ వాస్తవ ధర రూ. 1800 కాగా రూ. 600 మాత్రమే సబ్సిడీ అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందనీ, పవర్ స్ప్రేయర్‌కు మాత్రం 50 శాతం రాయితీ వర్తిస్తుందనీ చెప్పారు. గతంలోలా కాకుండా స్ప్రేయర్ కోసం మీసేవలో అప్‌లోడ్ చేస్తే ఏవో, ఏడీ, జేడీఏ అమోదం తెలుపుతారనీ, అనంతరం బ్యాంకులో డీడీ తీయాలని చెప్పారు. అధికారులు ఆన్‌లైన్‌లో అనుమతులిచ్చాక డీలరు స్ప్రేయర్ ఇవ్వాలని తెలిపారు. దీనంతటికీ ఎక్కువ సమమయం పడుతున్నందున సాధారణ స్ప్రేయర్‌కు వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులకు నివేదించామనీ, రెండు రోజుల్లో జిల్లాకు స్పేయర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement