మంత్రి అసమర్థతతో జిల్లాకు నష్టం | Sakshi
Sakshi News home page

మంత్రి అసమర్థతతో జిల్లాకు నష్టం

Published Fri, Sep 19 2014 3:09 AM

మంత్రి అసమర్థతతో జిల్లాకు నష్టం

వెంకటగిరిటౌన్ : మంత్రి పి.నారాయణ అసమర్థత వల్లే జిల్లాకు దక్కాల్సిన స్మార్ట్‌సిటీ, హీరో కంపెనీలు దక్కలేదని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. వెంకటగిరిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందన్నారు. జిల్లాలో అన్ని మౌలిక వసతులు ఉన్నా హీరో కంపెనీ చిత్తూరు జిల్లాకు కేటాయించడం కేవలం మంత్రి అసమర్థతేనన్నారు. జిల్లాలో ఏ పల్లె ఏ మండలంలో ఉందో తెలియని ఆయనకు కేవలం ఎన్నికల్లో ఆర్థికంగా ఆదుకున్నాడనే కారణంతో సీఎం చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టారన్నారు.   రైతులు ఓ వైపు రుణమాఫీ కాక, మరోవైపు గిట్టుబాటు ధరల్లేక కన్నీటి పర్యం తం అవుతుంటే టీడీపీ నేతలు వందరోజులు  సంబరాలు జరుపుకోవడం దారు ణమన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చి న రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి రూ.2వేలు, బెల్ట్‌షాపుల రద్దు, 9 గంటల వ్యవసాయ విద్యుత్, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, ధరల నియంత్రణ కు చర్యలు, పింఛన్ పెంపు తదితర వాటి ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోగా, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల్లో  కోతలు పెట్టేందుకు కమిటీలు, సర్వేలు చేపట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. రైతు రుణమాఫీలో రోజుకో విధంగా కొర్రీలు పెడుతున్న బాబు, తాజాగా పింఛన్ల కోతకు రంగం సిద్ధం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మేరిగ మురళీధర్, జెడ్పీ వైస్ చైర్మన్ శిరీష, కార్పొరేటర్ రూప్‌కుమార్‌యాదవ్, బాలాయపల్లి ఎంపీపీ సింగంశెట్టి భాస్కర్‌రావు, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి, నేతలు దుంపా రామచంద్రారెడ్డి, బీవీరారెడ్డి, జి.ఢిల్లీబాబు, చిట్టేటి హరికృష్ణ, సాయినాయుడు పాల్గొన్నారు.
 పోలేరమ్మకు ప్రత్యేక పూజలు
 వెంకటగిరి గ్రామ దేవత పోలేరమ్మను వైఎస్సార్ సీపీ నేతలు దర్శించుకున్నారు.ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ పోలేరమ్మ దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని వేడుకున్నట్టు చెప్పారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మేరిగ మురళీధర్, జెడ్పీ వైస్ చైర్మన్ శిరీషా  అమ్మవారికి పూజలు నిర్వహించా రు. సంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ వారికి  సత్కరించారు.


 

 

Advertisement
Advertisement