‘టెన్’షన్..! | Sakshi
Sakshi News home page

‘టెన్’షన్..!

Published Mon, Feb 16 2015 3:38 AM

Tennision

కర్నూలు(జిల్లా పరిషత్):  త్వరలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. కొత్త సిలబస్ నేపథ్యంలో ఈసారి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. గత ఏడాది జిల్లాలో 93 శాతం పదోతరగతి ఫలితాలు నమోదయ్యాయి. ఈసారి  60 శాతం మించితే గగనమని విద్యాధికారులు బాహాటంగా చర్చించుకుంటున్నారు.
 
 జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్, కస్తూరిబాగాంధి, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు కలిపి 799 ఉన్నాయి. మార్చి 26 నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు రెగ్యులర్ 49,187 మంది, ప్రైవేటుగా రాసే విద్యార్థులు  2,824, వొకేషనల్ విద్యార్థులు 1,792 మంది కలిపి మొత్తం ఈసారి 53,803 మంది హాజరుకానున్నారు. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారిందనే చెప్పొచ్చు.
 
  నూతన సిలబస్, సీసీఈ మెథడ్‌లో విద్యాబోధన.. ఉపాధ్యాయులను, విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. ఎక్కడైనా కొత్త సిలబస్, కొత్త విధానంలో విద్యాబోధన మొదలు పెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వేసవి సెలవుల్లోనే ఈ తంతు ముగించాలి. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో గత ఏడాది కొత్త సిలబస్ ప్రవేశపెట్టినా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. పాఠశాలల ప్రారంభమయ్యాక నెలరోజుల తర్వాత మొక్కుబడిగా టెలికాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. హడావుడి శిక్షణ 80 శాతం ఉపాధ్యాయులకు అర్థం కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే తరుణంలో సీసీఈ విధానంలో విద్యాబోధన చేయాలని ఒకసారి, అవసరం లేదని మరోసారి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి దారి తీయించింది.
 
  క్వార్టర్ల, హాఫ్‌ఇయర్లీ పరీక్షలు నిర్వహించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీనికితోడు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ)ని రద్దు చేసి విద్యాశాఖను మరింత ఇరకాటంలో పడేసింది. ఈ కారణంగా పరీక్షలను ఉపాధ్యాయులే సొంత ఖర్చుతో నిర్వహించుకోవాల్సి వచ్చింది. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి బోర్డులో చాక్‌పీస్‌తో ప్రశ్నలు రాసి హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించారంటే పరిస్థితి ఏ స్థితికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. చేతుల కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నష్టనివారణలో భాగంగా ప్రభుత్వం మళ్లీ డీసీఈబీని పునరుద్ధరించింది. అయితే దానికి నిధులు విడుదల చేయకుండా బాధ్యతలు మాత్రం అప్పగించింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement