పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుగ్గిరాలలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చింతమనేని అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టి చింతమనేనిని అరెస్ట్ చేశారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆయనను ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకూ కనిపించని చింతమనేని మంగళవారం కావూరి పర్యటనలో హడావుడి చేశారు. కలపర్రు టోల్ గేటు వద్ద కావూరి వాహనానికి అడ్డుపడి హంగామా చేశారు. ఆ తర్వాత కావూరి ఇంటివద్ద ఆయన అనుచరులతో గొడవపడి కర్చీలు విరగ్గొట్టారు. చివరకు కావూరితో పాటు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లి తాపీగా బయటకు వచ్చారు. చింతమనేని వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావూరితో సత్సంబంధాలున్న ప్రభాకర్ పథకం ప్రకారమే ఉద్యమకారులకంటే ముందు ఆయనను అడ్డుకుని ఆ తర్వాత వేడిని చల్లార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.