రూ.250 కోట్లతో మెగా ఫుడ్ పార్కు | Sakshi
Sakshi News home page

రూ.250 కోట్లతో మెగా ఫుడ్ పార్కు

Published Wed, Mar 25 2015 2:15 AM

Rs 250 crore mega food park

సాక్షి, విజయవాడ : జిల్లాలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 17 మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలని మంగళవారం నిర్ణయించింది. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా దాన్ని కృష్ణాజిల్లాలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఫుడ్ పార్కు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళికలను ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపడంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
 
ఫుడ్ పార్కు ఏర్పాటుకు రూ.250 కోట్ల వ్యయం...
మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు సుమారు రూ.250 కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సేకరిస్తారు. రాబోయే 30 నెలల్లో ఫుడ్‌పార్కు ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తారు. ఫుడ్ పార్కులో కనీసం 40 నుంచి 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. కోల్డ్ స్టోరేజ్‌లు, గోదాములు ఏర్పాటు చేసే అవకాశముంది. ఫుడ్ పార్కును జిల్లాలో వెనుకబడిన తిరువూరులో ఏర్పాటు చేయాలని ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారు. అక్కడ కాకపోతే మైలవరంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
 
ఉపయోగాలివీ...
రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఫుడ్ పార్కులో ఉన్న గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. పళ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడైపోయే సరకుల్ని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. పళ్లు, కూరగాయలు వంటి పంటలు దిగుబడి అధికంగా ఉన్నప్పుడు వాటి నుంచి జ్యూస్‌లు, ఇతర తినుబండారాలను తయారు చేయించుకుని విక్రయించుకునే సౌకర్యం ఫుడ్ పార్కులలో ఉంటుంది.
 
కూరగాయలు, పండ్లను రైతులు కోసిన తరువాత వాటిని శుభ్రం చేసి, వివిధ సైజుల్లో గ్రేడింగ్ చేసే యంత్రాలను కూడా ఫుడ్ పార్కులలో ఏర్పాటు చేస్తారు. ఇందులో నాణ్యమైన సరకును చక్కగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా విదేశాలకు ఎగుమతి చేసుకునే సౌకర్యం ఉంటుంది. రైతులకు తమ సరకు పాడైపోకముందే విక్రయించుకునేందుకు వీలుగా ఇక్కడే రిటైలర్లు, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే వ్యాపారులు కూడా ఫుడ్ పార్కులకు అనుబంధంగా పనిచేస్తూ ఉంటారు.
 
జిల్లాలో తొలి ఫుడ్ పార్కు... గతంలో నూజివీడు వద్ద మామిడికాయలను ప్రాసెసింగ్ చేసేందుకు ఒక ఫుడ్ పార్కును ఏర్పాటు చేసినా అది కొద్దిరోజులకే మూలన పడింది. చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన శ్రీని మెగా ఫుడ్ పార్కు ఆ ప్రాంత రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. మెగా ఫుడ్‌పార్కు వల్ల రైతులకే కాకుండా వందలాది మంది నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశముంది.

Advertisement
 
Advertisement
 
Advertisement