ఏసీబీ వలలో ఒంగోలు డీఎస్పీ | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఒంగోలు డీఎస్పీ

Published Thu, Jan 19 2017 3:40 AM

Ongole DSP in the ACB costody

చీరాల/ఒంగోలు క్రైం/గుంటూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల(పీటీసీ) డీఎస్పీగా పనిచేస్తున్న దేవిశెట్టి దుర్గాప్రసాద్‌ ఇళ్లపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు విలువైన పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దుర్గాప్రసాద్‌ గుంటూరు జిల్లాలో ఎస్‌ఐగా కెరీర్‌ ప్రారంభించి సీఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఒంగోలులో డీఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే ఏసీబీ సిబ్బంది ఏకకాలంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని దుర్గాప్రసాద్, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై దాడులు చేసింది.

ఆ వివరాలను సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ డీఎస్పీ రమా దేవి విలేకరులకు వెల్లడించారు. మొత్తం పదకొండు బృందాలతో కలసి 14 ప్రదేశాలపై దాడులు నిర్వహించామని చెప్పారు. గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లలో జరిపిన సోదాల్లో దుర్గాప్రసాద్‌ పేరుతో పాటు ఆయన అత్త ఉషారాణి, స్నేహితులు, బంధువుల పేర్లపై పలు ఆస్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు. అలాగే సోదాల్లో 750 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి, రూ.50 వేల నగదు బయట పడిందని తెలిపారు. మొత్తంగా ఆదాయానికి మించి రూ.2 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని వెల్లడించారు.

Advertisement
Advertisement