ఎన్నారై ఆయుర్వేద మందుల విరాళం | Sakshi
Sakshi News home page

ఎన్నారై ఆయుర్వేద మందుల విరాళం

Published Tue, Sep 1 2015 5:02 PM

NRI donates medicine for Srisailam Ayurvedic Hospital

శ్రీశైలం(కర్నూలు) : శ్రీశైలదేవస్థానం పరిధిలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అమెరికాలోని కాలిఫోర్నియాలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు అయిన ఎస్‌ఎస్‌వి ఆనంద్ ఆయుర్వేద మందులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ లావణ్య విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలంప్రాజెక్టు కాలనీలో ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన శిరివెళ్ల ఈసోబ్ కుమారుడు ఆనంద్ అమెరికాలో ఉంటున్నాడని తెలిపారు. ఆయుర్వేద వైద్యశాలకు అవసరమైన సింహనాడ గుగ్గులు, పైసరగుగ్గులు, పునార్నావాడ మందూరం , మండుకం, మృత్యుంజయ రోజ్, శలిసాది చూర్ణం, త్రిఫలచూర్ణం, అవిశపత్తికర చూర్ణం, లవణభాస్కరం చూర్ణం, యస్టిమధుచూర్ణం, శ్వాదిష్ట విరోచన చూర్ణం మొదలైన మందులను పంపినట్లు పేర్కొన్నారు.

వీటి విలువ సుమారు రూ.50 వేలకు పైగా ఉంటుందని, వివిధ ఆయుర్వేద పచారి షాపులలో కొనుగోలు చేసి వారి బంధువుల ద్వారా ఏఎన్‌ఎల్‌లో వైద్యశాలకు పంపించినట్లు తెలిపారు. ఎఎస్‌ఈ ఆనంద్ విరాళంగా అందజేసిన ఈ మందులు కీళ్ల నొప్పులు, ఆమవాతం, వాపులు, జలుబు, దగ్గు, గ్యాస్‌ట్రబుల్, ఆకలి కలిగించేవి, మలబద్దకం నిరోధించేవి ఉన్నాయని, వీటితో పాటు అనేక రోగాలు వీటి కాంబినేషన్ ద్వారా రూపొందించి వినియోగించడం వల్ల అనేక రోగాలు నివారించబడటానికి అవకాశం ఉందని చెప్పారు. శ్రీశైలం ప్రాంతంలోనే చదువుకుని విదేశాలలో స్థిరపడిన ఎంతో మంది ఆయుర్వేద వైద్యశాల అభివృద్ధికి విరాళాల ద్వారా తోడ్పడుతున్నందుకు డాక్టర్ లావణ్య అభినందనలు తెలిపారు. అల్లోపతి వైద్యం పెరిగిపోయి ఆయుర్వేద వైద్యం వెనుకబడిపోతున్న తరుణంలో ఈ వైద్యానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నామని, ఇందుకు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలలో చదువుకుని ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారంతా ఆయుర్వేద వైద్య అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.

Advertisement
Advertisement