జీవో 107ను రద్దు చేయాలి | Sakshi
Sakshi News home page

జీవో 107ను రద్దు చేయాలి

Published Mon, Nov 24 2014 3:36 AM

జీవో 107ను రద్దు చేయాలి

కర్నూలు(హాస్పిటల్): తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ వైద్యులు రెండో రోజు విధులను బహిష్కరించారు. జీవో 107ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి క్యాజువాలిటీ వరనకు జూనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జూడా నేతలు ప్రశాంత్, పవన్, భానుప్రదీప్ తదితరులు మాట్లాడారు. జూనియర్ వైద్యులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. తమ సమస్యలను 2012, 2013 నుంచి వరుసగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో న్యాయం జరుగుతుందని ఆశించామన్నారు.

అయితే 107 జీవోను అమలు చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పేద రోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది వేలాది వైద్య విద్యార్థులు పట్టా పుచ్చుకుని బయటికి వస్తున్నా.. ప్రభుత్వం వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. తమ భవిష్యత్తు కోసమే సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం తక్షనం స్పందించి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
 
 ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
 ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తామని చెబుతున్నా ఎందుకు పెడచెవిన పెడుతుందో అర్థం కావడం లేదు. అంధకారంగా మారుతున్న మా భవిష్యత్తు కోసం రోడ్డెక్కాం. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. తాత్కాలికంగా వైద్యులతో సేవలు చేయించుకోకుండా, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి.         
 -డాక్టర్ ఉమాతేజస్వి
 
 ఆనాడు చంద్రబాబు వ్యతిరేకించారు
 రాష్ట్రంలో జూనియర్ వైద్యులపై నిర్బంధ వైద్యసేవ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. జూడాలకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నిర్బంధ వైద్య సేవ చేయాలని జీవో 107ను జారీ చేయడం తగదు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంబిస్తోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం.
             - డాక్టర్ నిరంజన్

Advertisement

తప్పక చదవండి

Advertisement