హామీలన్నీ నెరవేర్చాం | Sakshi
Sakshi News home page

హామీలన్నీ నెరవేర్చాం

Published Wed, Aug 16 2017 1:49 AM

హామీలన్నీ నెరవేర్చాం - Sakshi

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత ఎన్నికల్లో తానిచ్చిన హామీలనన్నింటినీ నెరవేర్చానని, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నామన్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో మంగళవారం ఉదయం 71వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే రూ.7వేల పింఛన్‌ను రూ.15 వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

రాష్ట్రమంతా ఈనెల 25 నుంచి 30 వరకూ ‘జలసిరికి హారతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో ఇండోృయూఎస్‌ ఆధ్వర్యంలో ఓ మెడికల్‌ కాలేజీని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. కేంద్రం తన హామీలను నిలబెట్టుకుంటూ రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తులపై కోర్టు ద్వారానైనా మనకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. రాష్ట్రంలో రెండు నెలల్లో నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు.

విజయ దశమిలోగా రాష్ట్రమంతా ఎంపిక చేసిన పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. నీటి సంరక్షణ మనందరి బాధ్యత అంటూ, శ్రీశైలానికి ఇప్పటి వరకూ నీళ్లు రాలేదనీ.. మహారాష్ట్ర, కర్ణాటక, కొత్తగా తెలంగాణ రాష్ట్రాలు నీళ్లు వదలడంలేదన్నారు. ఇందుకోసం నదుల అనుసంధానం అవసరమన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీతో నీళ్లు తెస్తామని, మరుసటి ఏడాది ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను పూర్తిచేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు అన్నారు. 
 
3 నెలల్లో 28 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
సాక్షి, రాజమహేంద్రవరం: వచ్చే మూడు నెలల్లో రూ.13 వేల కోట్లతో 28 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జలసిరి పేరుతో ఇప్పటికే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ఎంపిక చేశామన్నారు. ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఒక్క మోటారు ఆన్‌ చేసి ప్రారంభించారు. 

Advertisement
Advertisement