
రేపటి నుంచి జైలులోనే జగన్ ఆమరణదీక్ష
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపటి నుంచి చంచల్గూడ జైలులో ఆమరణదీక్ష చేపట్టనున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపటి నుంచి చంచల్గూడ జైలులో ఆమరణదీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆరు రోజుల పాటు సమరదీక్ష చేసిన విషయం తెలిసిందే. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారుల అనుమతితో జగన్ ఆమెతో ఫోన్ లో మాట్లాడి నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. ఈ నేపధ్యంలో జగన్ జైలులోనే రేపటి నుంచి ఆమరణదీక్ష చేపట్టాలని నిర్ణయించారు.
జగన్ సతీమణి వైఎస్ భారతి ఈరోజు ఉదయం జైలులో జగన్ను కలిశారు. ఆమెతోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా జైలు లోపలకు జగన్ను కలిసేందుకు వెళ్లారు. వారు బయటకు వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ప్రజా ఉద్యమాలకు వైఎస్ఆర్ సిపి నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు.