ఓటమి భయంతో తమ్ముళ్ల బీభత్సం | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో తమ్ముళ్ల బీభత్సం

Published Sun, Apr 16 2017 1:58 AM

ఓటమి భయంతో తమ్ముళ్ల బీభత్సం - Sakshi

ప్రొద్దుటూరు చైర్మన్‌ ఎన్నికలో హైడ్రామా

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీకి దక్కకుండా ఉండేందుకు శనివారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తోపాటు ఆయన వర్గీయులు బీభత్సం సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేశారు. మినిట్స్‌ బుక్‌ను టీడీపీ కౌన్సిలర్లు చించి వేయడం,ఫర్నీచర్‌ ధ్వంసం చేయడంతోపాటు ప్రిసైడింగ్‌ అధికారి (ఆర్డీఓ) వినాయకం చేతిలోని మైక్‌ను విసిరేశారు. ఎన్నికల హాల్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. గేట్లు తోసేసి నేరుగా లోనికి వెళ్లారు. దీంతో ఎన్నిక ఆదివారానికి వాయిదా వేశారు. కాగా ప్రొద్దుటూరు కౌన్సిల్‌కు సంబంధించి మొత్తం 40మంది సభ్యులు ఉన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 22మంది, వైఎస్సార్‌సీపీ తరఫున 18 మంది గెలిచారు. ఏడాది క్రితం వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్‌ మాజీ ఇన్‌చార్జి చైర్మన్‌ ముక్తియార్‌తోపాటు 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వరదరాజులరెడ్డి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైర్మన్‌గా ఉన్న గురివిరెడ్డితో ఇటీవల పదవికి రాజీనామా చేయించారు. ముక్తియార్‌ టీడీపీలో చేరినప్పటి నుంచి వరదరాజులరెడ్డి వ్యతిరేక వర్గంలో కొనసాగుతున్నాడు.

ఈ నేపథ్యంలో స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్న ముక్తియార్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి పోటీపడ్డారు. ఎన్నిక సమయంలో ముక్తియార్‌ మొత్తం 15మంది కౌన్సిలర్లతో హాజరు కాగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 9మందితో హాజరయ్యారు. మొత్తం 25మంది సభ్యులు ఎన్నికకు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం 21 మంది సభ్యులు హాజరైతే ఎన్నిక జరపాలి.దీంతె చేయిదాటిపోతోందని తెలుసుకున్న వరదరాజులరెడ్డి వర్గీయులు బీభత్సం సృష్టించారు.దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు,  ఉన్నతాధికారులకు ఫిర్యాదు పంపారు.

Advertisement
Advertisement