అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్య

Published Thu, Nov 26 2015 7:13 PM

Farmer commits suicide

గుడివాడ రూరల్ : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ మండలం పర్నాస గ్రామానికి చెందిన కంభం శ్రీనివాసరావు(43) సుమారు నాలుగెకరాలు కౌలు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట పూర్తిగా నాశనమైంది. సుమారు రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అప్పుల బాధ పడలేక ఖాళీ సమయంలో గుడివాడలో కొబ్బరి బోండాలు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుడివాడలో పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతడ్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీఆర్వో దాశరధి గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, డిగ్రీ చదువుతున్న కుమారుడు, ఇంటర్‌మీడియట్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. తల్లి జయమ్మ కూడా కుమారుడిపైనే ఆధారపడి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలను కష్టపడి చదివిస్తున్నాడు. ఒక్కసారిగా అనుకోని సంఘటన జరగడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. శ్రీనివాసరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement