దుర్గగుడి హుండీలో కానుకలు చోరీ | Sakshi
Sakshi News home page

దుర్గగుడి హుండీలో కానుకలు చోరీ

Published Sun, Oct 26 2014 2:25 AM

దుర్గగుడి హుండీలో కానుకలు చోరీ - Sakshi

  • ఆలయ అధికారులకు పట్టుబడ్డ యువకుడు
  •  సీసీఎస్ సిబ్బందికి అప్పగింత
  • ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులు సమర్పించిన నగదు కానుకలను చోరీ చేస్తున్న యువకుడు శనివారం ఆలయ అధికారులకు పట్టుబడ్డాడు. ఆలయ ప్రాంగణంలోని రూ.20, శీఘ్రదర్శనం రూ.100 టికెట్ క్యూలైన్ల మధ్య ఇటీవల స్టీల్ హుండీని ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించిన కానుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దాని పైభాగంలో చుట్టూ వస్త్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.

    ఆ వస్త్రంలో భక్తులు వేసిన కానుకలు హుండీలో పడతాయి. అయితే ఈ హుండీలో వేసిన కానుకలు నేరుగా లోపలకు వెళ్లకుండా ఉండేందుకు చిట్టినగర్‌కు చెందిన శివప్రసాద్ అనే యువకుడు ఓ చిట్కా కనిపెట్టాడు. శనివారం మధ్యాహ్న సమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో రూ.20 టికెట్ క్యూలైన్‌లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాడు. క్లాత్ హుండీలో న్యూస్ పేపర్ వేశాడు. దీంతో హుండీ లోపల మూతి మూసుకుపోవడంతో భక్తులు వేసిన కానుకలు పేపర్‌పై ఉండిపోయాయి. సుమారు గంట తర్వాత వచ్చిన శివప్రసాద్ పేపర్‌పై ఉన్న నోట్లను తీస్తుండగా ఆలయ అధికారులు గమనించారు.

    అతడిని అదుపులోకి తీసుకుని దేవస్థానం ప్రాంగణంలోని పోలీస్ అవుట్‌పోస్టుకు తరలించారు. అక్కడి నుంచి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీసీఎస్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శివప్రసాద్ వద్ద రూ.2 వేలకు పైగా నగదు లభ్యమైనట్లు వారు పేర్కొంటున్నారు. ఈ వ్యవహా రం ఎంతకాలం నుంచి సాగుతోంది? ఆలయాల్లో  చోరీలు  చేసే ముఠాలతో ఇతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
     

Advertisement
Advertisement