డెంగీ టెర్రర్‌! | Sakshi
Sakshi News home page

డెంగీ టెర్రర్‌!

Published Mon, Aug 21 2017 4:49 AM

డెంగీ టెర్రర్‌! - Sakshi

►  ఈ ఏడాది డబుల్‌ సెంచరీకి చేరుకోనున్న డెంగీ కేసులు
►  దర్శి మండలంలో అత్యధికంగా జ్వర పీడితులు
►   జ్వరాల తీవ్రతతో ప్రజల్లో ఆందోళన
►   వ్యాధి నిర్ధారణలో తీవ్ర జాప్యం
►  డెంగీ పేరుతో రోగుల్ని దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు


చీమకుర్తి రూరల్‌:  గ్రామాల్లో డెంగీ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది డెంగీ జ్వరాలు డబుల్‌ సెంచరీని దాటే అవకాశాలున్నాయి. 2017 జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు కేవలం 7 నెలల కాలంలోనే జిల్లాలో నమోదైన డెంగీ కేసులు 152కు చేరుకున్నాయి. అదే గత ఏడాది 2016లో ఏకంగా 194 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లా మలేరియా కార్యాలయ గణాంకాల మేరకు.. 2013లో కేవలం 15 కేసులు మాత్రమే జిల్లా మొత్తం మీద నమోదు కాగా ఆ మరుసటి సంవత్సరం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాంటిది 2015లో 74 కేసుల నుంచి గత ఏడాది 194 కేసులు నమోదయ్యాయి.

డెంగీ నమోదులో దర్శి మండలం ఫస్ట్‌:
సాక్షాత్తు జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి మండలం డెంగీ కేసుల నమోదులో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది నమోదైన 152 కేసుల్లో దర్శి మండలంలో అత్యధికంగా 16 మందికి డెంగీ సోకింది. తర్వాత స్థానం మార్కాపురంలో 10 కేసులు, యర్రగొండపాలెంలో 8, కొండపి, ఒంగోలులో తలో 7, తర్లుపాడులో 6, దొనకొండలో 5, తాళ్లూరులో 5, చీమకుర్తిలో 7 కేసులు మిగిలిన మండలాల్లో 80 కేసుల వరకు నమోదయ్యాయి. నెలన్నర క్రితం సంతనూతలపాడు మండలంలోని చిలకపాడు, మద్దులూరులో ఏకంగా 8 మందికి డెంగీ జ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే.

అదే విధంగా రెండు వారాల క్రితం చీమకుర్తి మండలం పాటిమీదపాలెంలో ఆరుగురికి డెంగీ జ్వరాలు వచ్చి ఒంగోలు రిమ్స్‌లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. తాజాగా> ఇప్పుడు రెండు, మూడు రోజుల నుంచి దేవరపాలెంలో విషజ్వరాలు వచ్చి ఇంటికి ఇద్దరు ముగ్గురు లెక్కన మంచాన పడ్డారు. వారిలో ఒకరిద్దరికి డెంగీ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. 

సంతనూతలపాడు నియోజకవర్గంలో పాటిమీదపాలెం, దేవరపాలెం, చిలకపాడు, మద్దులూరు గ్రామాల్లోనే డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ దోమ మంచినీళ్లలోనే పెరుగుతుందని ఇప్పటికే వైద్యశాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. కానీ ఇళ్ల వద్ద నిరుపయోగంగా ఉన్న తొట్లు, డబ్బాలు, టైర్లు, పాడుబడిన బావులు, రామతీర్థంలోని నిరుపయోగంగా ఉన్న గ్రానైట్‌ గుంతల్లో నిల్వ ఉన్న నీటిలో డెంగీ దోమలు పెరగటానికి అనుకూలంగా ఉండటంతో జ్వరాలు విస్తరించటానికి మార్గం సులువైంది.

డెంగీ నిర్ధారణ రిమ్స్‌లోనే:
డెంగీ జ్వరాన్ని నిర్ధారించే ఎలీసా టెస్ట్‌ జిల్లాలోని రిమ్స్‌లో మాత్రమే ఉంది. ఎలీసా టెస్ట్‌ను నిర్వహించే కిట్‌ ఖరీదైంది కావడంతో కనీసం పది మంది డెంగీ అనుమానితులు వస్తే తప్ప నిర్ధారణ పరీక్షలు చేయటం లేదనే ఆరోపణలు రోగుల బంధువుల నుంచి వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కిట్‌ మెథడ్‌లో డెంగీ జ్వరాన్ని నిర్ధారిస్తున్నారని మలేరియా శాఖ అధికారులు అంటున్నారు. కానీ కిట్‌ మె«థడ్‌ డెంగీ నిర్ధారణకు అంత కచ్చితత్వం లేదంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల బలహీనతలను దృష్టిలో ఉంచుకొని డెంగీ నిర్ధారణ కాకపోయినా డెంగీ పేరుతో అనుమానాలను సృష్టించి చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

ప్లేట్‌లెట్స్‌ కోసం గుంటూరు పోవాల్సిందే:
ఒక వేళ డెంగీ నిర్ధారణ అయితే రోగికి అకస్మాత్తుగా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గి ప్రాణానికి ప్రమాదకరంగా మారితే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించే మిషన్‌ రిమ్స్‌లో లేకపోవడంతో స్థానిక డాక్టర్లు గుంటూరుకు రిఫర్‌ చేస్తున్నారు. డెంగీ నిరా>్ధరణ అయి తీరా గుంటూరుకు పోయే సరికి రోగి ప్రాణాల మీదకు వస్తోంది. రోగి వైద్యానికి దాదాపు రూ.2, రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రోగులు ఆవేదన చెందుతున్నారు.

అవగాహన పెంచుకోవడంతోనే డెంగీ దూరం:
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా డెంగీ దోమలు స్థానిక పరిస్థితుల్లో విస్తరించాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీళ్లు ఎప్పటికప్పుడు నిల్వ లేకుండా చూసుకోవడం, దోమ తెరలు తప్పకుండా వాడటం వంటి జాగ్రత్తలతోనే డెంగీకి దూరంగా ఉండొచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement