‘బొండా’ ఆగడాలు సహించం | Sakshi
Sakshi News home page

‘బొండా’ ఆగడాలు సహించం

Published Mon, Mar 30 2015 4:15 AM

'Bonde' agadalu sahincam

సాక్షి, విజయవాడ : అధికారాన్ని అడ్డు పెట్టుకుని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించబోమని బీజేపీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు హెచ్చరించారు. బీజేపీ నగర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వంగవీటి మోహనరంగా, రత్నకుమారి, వంగవీటి రాధాకృష్ణ, కోట శ్రీనివాసరావు, మల్లాది విష్ణు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు సత్యనారాయణపురం ప్రశాంతంగా ఉందని, బొండా ఉమా వచ్చాక ఒంటెద్దు పోకడలకు పోతూ ఇతర సామాజిక వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బొండా ఉమా అండతో స్థానిక కార్పొరేటర్ మహేష్ రెచ్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఉమామహేశ్వరరాజు ఆరోపించారు. బీజేపీ ట్రేడర్స్ సెల్ నాయకుడు బి.సత్యనారాయణకు చెందిన స్థలంలో మహేష్ తన పార్టీ పోల్‌ను పాతి హడావుడి చేస్తున్నారన్నారు. టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఇంట్లో అద్దెకు ఉంటున్న టైలర్‌ను బలవంతంగా ఖాళీ చేయించి ప్రశాంతంగా ఉన్న సత్యనారాయణపురంలో అరాచకం సృష్టించారని విమర్శించారు. టీడీపీ 20వ డివిజన్ కార్పొరేటర్ దందాలతో మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
 
కల్యాణ మండపంపై అంత ఆసక్తి ఎందుకు?
సత్యనారాయణపురంలోని సీతారామ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా ప్రోద్బలంతోనే దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. అడ్డుకున్న బీజేపీ నాయకుడు యేలేశ్వరపు జగన్మోహనరాజుపై దాడిచేసి గాయపరిచారని, దీన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఉమామహేశ్వరరాజు పేర్కొన్నారు. కనకదుర్గమ్మ ఆస్తుల ఆక్రమణలపై కోర్టు తీర్పులు ఇచ్చినా పట్టించుకోని ప్రజాప్రతినిధులు సీతారామ కల్యాణమండపం స్వాధీనంపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో వ్యవస్థ కుప్పకూలిందని, మంత్రుల మాట ఎమ్మెల్యేలు వినే పరిస్థితి వచ్చిందన్నారు. పశుపు చొక్కా నేతలకు తొత్తులుగా నగర పోలీసులు తయారయ్యారని, వారికే పోలీసులు సెల్యూట్ కొడుతున్నారని దుయ్యబట్టారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను తమ పార్టీ పెద్దల ద్వారా త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. టీడీపీ మిత్రధర్మం పాటించడం లేదనే విషయాన్ని తమ పార్టీ పెద్దలకు తెలియజేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎల్‌ఆర్‌కే ప్రసాద్, కోట కృష్ణభగవాన్, పుచ్చా పూర్ణానందం, నగర నాయకులు లాకా వెంగళరావు యాదవ్, పీవీ ప్రసాద్, ఆర్మూగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement