మృత్యుశకటం | Sakshi
Sakshi News home page

మృత్యుశకటం

Published Tue, Dec 23 2014 12:30 AM

మృత్యుశకటం - Sakshi

ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో ఆనందంగా గడిపారు ఆ చిన్నారులు. సోమవారం ఉదయాన్నే స్కూలుకెళ్లేందుకు భారంగా నిద్రలేచారు. ఓ వైపు చలి వణికిస్తున్నా తల్లిదండ్రులు వారిని త్వరత్వరగా ముస్తాబు చేసి స్కూలుకు పంపేందుకు భోజనం క్యారియర్లు సిద్ధం చేశారు. అమ్మానాన్నలకు టాటా..చెప్పి ఆటో ఎక్కిన ఆ పిల్లలు కాసేపటికే కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
 
* ఆటోను ఢీకొన్న స్కూలు బస్సు
* ఇద్దరు చిన్నారుల దుర్మరణం
* 14 మందికి తీవ్రగాయాలు
* ముగ్గురి పరిస్థితి విషమం

చిల్లకూరు: ఆటోలో స్కూల్‌కు బయలుదేరిన చిన్నారుల పాలిట  ఓ ప్రైవేటు స్కూల్ బస్సు మృత్యుశకటంగా మారింది. వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొనడంతో మోడిబోయిన వెంకీ(7), దొడ్డగ వినయ్(7) మృతిచెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఇళ్ల నుంచి బయలుదేరిన తమ పిల్లలు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.  తీపనూరు సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..తీపనూరుకు చెందిన వెంకీ, వినయ్, శ్రీ వంశీ, భావన, శ్రీదివ్య చిల్లకూరులోని ఎస్‌కెఆర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో యూకేజీ చదువుతున్నారు.

చిల్లకూరు సమీపంలోని ఎల్‌ఏపీ పాఠశాలలో చదువుతున్న అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, దినేష్, చరణ్‌తేజ, సుశాంక్, సునీల్, శ్రీహరి,రక్షిత, జగన్‌తో పాటు చిల్లకూరులోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదివే సుజీ విమలాదేవి, మౌనిక ఒకే ఆటోలో బయలుదేరారు. గ్రామాన్ని దాటిన కొద్దిసేపటికే వీరి ఆటో ప్రమాదానికి గురైంది. గూడూరు నుంచి పిల్లల కోసం బయలుదేరిన ఓ కార్పొరేట్ స్కూలు బస్సు వేగంగా వస్తూ ఆటోను ఢీకొంది. కొంతదూరం ఆటోను ఈడ్చుకెళ్లడంతో అందులోని విద్యార్థులతో పాటు డ్రైవర్ రాఘవయ్య తీవ్రగాయాలపాలయ్యారు.

మౌనిక వెంటనే తేరుకుని గ్రామం వైపు పరుగుతీసింది. ఓడూరు వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తమ పెద్దలకు సమాచారం ఇవ్వాలని కోరింది. వారిలో ఒకరు 108, 100కు సమాచారం అందించగా మరొకరు తీపనూరుకు వెళ్లి గ్రామస్తులకు ప్ర మాదవిషయాన్ని తెలియజేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన పిల్లల తల్లిదండ్రులు ఆందోళనగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపు గూ డూరు, చిల్లకూరు, కోట నుంచి 108 అంబులెన్స్‌లు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను గూ డూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అక్కడ సరైన వైద్యం అందే పరిస్థితి లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకి, వంశీ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో మిగిలిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌ల్లో నెల్లూరులోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో చరణ్‌తేజ, సుశాంక్, జగన్ పరిస్దితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఏరియా ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది.
 
వివరాల సేకరణ
ఘటన జరిగిన వెంటనే డీఈఓ ఆంజనేయులు, గూడూరు ఆర్డీఓ రవీంద్ర, డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు చిల్లకూరు తహశీల్దార్ శ్రీకాంత్‌కేదారినాథ్, ఎంపీడీఓ చిరంజీవి, డిప్యూటి డీఈఓ మంజులాక్షి, ఎంఈఓ మధుసూదన్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలను సేకరించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు.
 
మృతదేహాల అప్పగింత
వెంకి, వినయ్ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన స్కూలు బస్సు డ్రైవర్ కాలేషాను పోలీసులు అదుపులోకి తీసుకోగా క్లీనర్ శ్రీను పరారీలో ఉన్నాడు. ఎస్సై దశరథరామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement