అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి

Published Sat, May 4 2024 9:20 AM

అప్రమత్తతతో  విధులు నిర్వర్తించాలి

సిబ్బందికి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశం

అనంతపురం అర్బన్‌: జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో (డీసీసీసీ) పనిచేసే సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఎస్పీ అమిత్‌ బర్దర్‌తో కలిసి కలెక్టర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. స్టాటిస్టిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ యూనిట్‌ నుంచి జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద లైవ్‌ స్ట్రీమింగ్‌ను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరాలను రిజిస్టర్‌లో పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. వెబ్‌కాస్టింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద లైవ్‌ స్ట్రీమింగ్‌, ఎఫ్‌ఎస్‌టీ వాహనాల లైవ్‌ స్ట్రీమింగ్‌, జీపీఎస్‌ ద్వారా వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రాత్రి సమయంలో లైవ్‌ స్ట్రీమింగ్‌ బాగా జరుగుతోందా...? ఏవైనా సమస్యలు ఉన్నాయా..? అంటూ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న, నోడల్‌ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

జగన్‌ పాటకే భయపడ్డారు!

హిందూపురంలో

టీడీపీకి ఓటమి భయం

వైఎస్‌ జగన్‌ పాటలు పెట్టారంటూ

పచ్చ నేతల గొడవ

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి..

ముగ్గురికి గాయాలు

హిందూపురం అర్బన్‌: ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్‌ జగన్‌ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్‌ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ నాయకులు చూసి తట్టుకోలేక ఘర్షణకు దిగుతున్నారు. ఈక్రమంలోనే ముద్దిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించారు. గురువారం బాలకృష్ణ సతీమణి వసుంధర ముద్దిరెడ్డిపల్లిలో రోడ్‌ షో నిర్వహించారు. అదే సమయంలో అక్కడే వైఎస్సార్‌ సీపీ ప్రచార జీపు కూడా ఉంది. అందులో జగన్‌ పాటలు వినిపిస్తుండటంతో పచ్చమూకలు రెచ్చిపోయాయి. జగన్‌ పాటలు ఎందుకు పెట్టారంటూ దౌర్జన్యానికి దిగారు. స్థానికులు నచ్చ జెప్పటంతో అప్పటికి వెనుతిరిగారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు అక్కడ గుమికూడటంతో.. వైఎస్సార్‌సీపీ నాయకులూ అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం అవసరం లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు చెబుతుండగానే... టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు లోకేష్‌, నాగభూషన్‌రెడ్డి, నవీన్‌, బాబు, అసీఫ్‌లపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లోకేష్‌తో పాటు బాబు, నవీన్‌లకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడిలో తమకూ గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభం కాగా, పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ నేతలు దాడులకు తెగబడిన టీడీపీ నేతలపై వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ సీపీ నేతలపై టీడీపీ నేతలూ ఫిర్యాదు చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement