రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Published Tue, Feb 27 2024 6:26 AM

TS Intermediate Exam from tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు మొదలుకానున్నా యి. మార్చి 19 వరకూ జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రాక్టికల్స్‌ పూర్తయ్యాయి. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు 9,80,978 మంది హాజరవుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. రెండో ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించారు. ఈసారి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా ఇంటర్‌ బోర్డ్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పేపర్‌ లీకేజీకి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయి అధికారులను మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారు. 

1,521 పరీక్ష కేంద్రాలు... 
ఇంటర్‌ పరీక్షలకు 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 407 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను, ప్రభుత్వ ఆ«దీనంలో ఉండే 407 కాలేజీలను, 880 ప్రైవేటు కాలేజీలను పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేశారు. 1521 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష విధుల్లో ఉండబోతున్నారు. 200 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించారు. 

రంగంలోకి అన్ని విభాగాలు.. 
► పరీక్షలు రాసే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్ష కేంద్రం వద్ద ప్రా­థమిక వైద్య సదుపాయాలు, ఒక నర్సును అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు ఆదేశించారు.  
► ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144వ సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తెరుస్తారు.  

విద్యార్థులకు బోర్డ్‌ సూచనలు.. 
► విద్యార్థులు  ్టtsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనిపై ప్రిన్సిపల్స్‌ సంతకాలు ఉండాల్సిన అవసరం లేదు. హాల్‌ టికెట్లు ఇవ్వడానికి కాలేజీలు నిరాకరిస్తే ఇంటర్‌ బోర్డ్‌ దృష్టికి తేవాలి. 
► పరీక్ష ప్రారంభమయ్యే 9 గంటలకు ఒక్క నిమి షం ఆలస్యమైనా అనుమతించరు. అ­భ్య­ర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 

► పరీక్ష కేంద్రంలో పావుగంట ముందే ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తారు. అభ్యర్థి పూర్తి వివరాలను 9 గంటల లోపు చూసుకుని, తప్పులుంటే ఇని్వజిలేటర్‌ దృష్టికి తేవాలి.  
► మొబైల్‌ ఫోన్లు, ఎల్రక్టానిక్స్‌ వస్తువులు, ప్రింటెండ్‌ మెటీరియల్స్‌ కేంద్రాల్లోకి అనుమతించరు.  

కౌన్సెలింగ్‌ కోసం టోల్‌ ఫ్రీ... 
పరీక్షల ఫోబియో వెంటాడుతూ ఆందోళనకు గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి ఇంటర్‌ బోర్డ్‌ ‘టెలీ మానస్‌’పేరుతో టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040–24655027 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.  

ఈసారి ప్రశ్న పత్రాల్లో తప్పులు రావు: ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి శ్రుతి ఓజా 
ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి శ్రుతి ఓజా సూచించారు. పరీక్షల నేపథ్యంలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతీ కేంద్రాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈసారి ఎక్కడా ప్రశ్న పత్రాల్లో తప్పులు రాబోవని హామీ ఇచ్చారు. సమావేశంలో ఇంటర్‌ పరీక్షల నియంత్రణాధికారి జయప్రదాభాయ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement