సాక్షి, న్యూఢిల్లీ: డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానాలో రూ.పది కోట్లు కట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు చేపడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రమౌళీశ్వరరెడ్డి వేర్వే రుగా దాఖలు చేసిన పిటిషన్లను ఎన్జీటీ చెన్నై బెంచ్ గతంలో విచారించిన సంగతి తెలిసిందే.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రూ.528 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.92.85 కోట్లు, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు అదనంగా రూ.300 కోట్లు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.920.85 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దు
మొత్తం జరిమానా ఎంతంటూ ధర్మాసనం ప్రశ్నించగా డిండి ప్రాజెక్టు విషయంలో రూ.92 కోట్ల జరిమానా విధించారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ఎవరు పరిష్కరించాలి? కేంద్ర ప్రభుత్వమా? లేక కోర్టు చొరవ తీసుకోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
కేంద్రం నుంచి తగిన మార్గదర్శకాలు తీసుకుంటానని న్యాయవాది తెలుపగా మార్గదర్శకాలు త్వరగా తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, ప్రస్తుత డిండి కేసుతో సంబంధం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు.
చివరగా... ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం డిండి ప్రాజెక్టుకు విధించిన రూ 92 కోట్ల జరిమానాలో రూ.పది కోట్లను కేఆర్‌ఎంబీ ఎదుట మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన జరిమానా విషయంలో ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై అభ్యంతరం ఉంటే నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పనులు కొనసాగించుకోవచ్చు..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తాగు నీటి అవసరాలకు సంబంధించి 75 టీఎంసీల మేర పనులు కొనసాగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఎనీ్టటీ విధించిన రూ.528కోట్ల జరిమానాలపై స్టే ఇస్తూ ఫిబ్రవరి 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రెండు పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేయా లని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment