సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ సర్వ సు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా ఈనెల 18న ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సర్వి స్ ప్రొవైడర్‌గా ఈ రైలు సేవలు కొనసాగనున్నాయి. దీనికి ‘పుణ్యక్షేత్ర యాత్ర– పూరీ–కాశీ–అయోధ్య యాత్ర’గా నామకరణం చేశారు.
ఈనెల 18 నుంచి 26 వరకు 8 రాత్రులు, 9 పగళ్లు ఈ యాత్ర కొనసాగనుంది. పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి పుణ్య క్షేత్రాలను చుట్టిరానుంది. ఈ రైలు 18న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో బయలుదేరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిర్ధారిత ముఖ్య స్టేషన్‌లలో ఆగుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్‌లలో దీనికి హాల్టులుంటాయి.
హోటళ్లలో బస ఏర్పాటు
ఎకానమీ కేటగిరీలో టికెట్ బుక్ చేసుకునేవారికి హోటళ్లలో రాత్రి బసకు నాన్ ఏసీ గదులను కేటాయిస్తారు, స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీ ప్రయాణికులకు ఏసీ గదులుంటాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాల్లో వెళ్లాల్సిన చోట ఎకానమీ, స్టాండర్ట్ కేటగిరీ వారికి నాన్ ఏసీ వాహనాలు, కంఫర్ట్ వారికి ఏసీ వాహనాలు ఏర్పాటు చేస్తారు. భోజనంలో కేవలం శాఖాహారాన్నే అందిస్తారు. టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు విడిగా చార్జి చేయరు. ప్రయాణికులకు ప్రయాణ బీమా చేయిస్తారు.
తీర్థయాత్రికులకు గొప్ప అవకాశం: అరుణ్‌కుమార్ జైన్
తీర్థయాత్రలు చేయాలనుకునేవారికి భారత్ గౌరవ్ రైలు రూపంలో గొప్ప అవకాశాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఆయన రైల్ నిలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ రైలు వివరాలు వెల్లడించారు. ఈ రైలులో ప్రయాణం వైవిధ్యంగా, పూర్తి సౌకర్యంగా ఉంటుందని, యాత్రికులకు మధురానుభూతిని పంచుతుందని తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో తిరిగేందుకు వాహనాలు మాట్లాడుకోవటం, భోజనం, బస కోసం హోటళ్ల వెంట పరుగెత్తాల్సిన పనిలేకుండా అన్నీ తామే ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో ఆందోళన లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా పర్యాటకులు యాత్ర చేసే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఉదయ్‌కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ డీఆర్‌ఎం అభయ్‌కుమార్ గుప్తా, ఐఆర్‌సీటీసీ గ్రూప్ జీఎం రాజా కుమార్, సీపీఆర్‌ఓ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment