‘హియర్‌ సే ఎవిడెన్స్‌’ సాక్ష్యంగా చెల్లదు | Sakshi
Sakshi News home page

‘హియర్‌ సే ఎవిడెన్స్‌’ సాక్ష్యంగా చెల్లదు

Published Tue, Apr 9 2024 5:56 AM

HC Reserves Orders in Bail Pleas of Viveka Murder Accused - Sakshi

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదు

గూగుల్‌ టేక్‌ అవుట్‌ ప్రామాణికమని ఆ సంస్థే చెప్పదు

వీటి ఆధారంగా నిందితులుగా పేర్కొనడం సాధ్యం కాదు

కుమారుడితో తండ్రి మాట్లాడినా అదీ కుట్రే అంటున్నారు

వైఎస్‌ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు

బెయిల్‌ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్‌ సే ఎవిడెన్స్‌ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్‌ టేక్‌ అవుట్‌ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమారెడ్డి తరపు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్‌ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్‌) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు.

ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్‌ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్‌ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్‌ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు.

ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్‌ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలు­లో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్‌ మంజూరు చేయాలి.

ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్‌ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement