Tamil Nadu Politics Updates In Telugu: DMK President And CM MK Stalin And AIADMK Palaniswami Becomes Key In National Politics - Sakshi
Sakshi News home page

Tamilnadu: ఢిల్లీలో చక్రం తిప్పే తమిళ తంబి ఎవరో..?

Published Thu, Jul 20 2023 1:34 AM

Who will be the Tamil leader can challenge Delhi ? - Sakshi

డీఎంకే అధ్యక్షుడు, సీఎంగా ఎంకే స్టాలిన్‌, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎంగా పళణిస్వామి జాతీయ రాజకీయాల్లో రాణించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకోసం రానున్న లోక్‌సభ ఎన్నికలను ఈ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ భేటీలో పళణి స్వామికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చునే అవకాశం రావడం అన్నాడీఎంకే వర్గాల్లో అమితానందాన్ని నింపింది. ఇక బెంగళూరులో జరిగిన ఐ.ఎన్‌.డి.ఐ.ఎ భేటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ పక్కనే కూర్చోవడంతో పాటు జాతీయ స్థాయి ప్రతిపక్షాల కూటమిలో స్టాలిన్‌కు సముచిత స్థానం దక్కడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఎవరు చక్రం తిప్పుతారనే చర్చ జోరందుకుంది.

సాక్షి, చైన్నె: జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర ఎప్పుడూ కీలకంగానే ఉంటున్నాయి. దివంగత నేతలు కామరాజర్‌, అన్నాదురై, ఎంజీఆర్‌ వంటి వారు జాతీయ రాజకీయాలలో రాణించిన వారే. అయితే, జాతీయ రాజకీయాలను శాసించిన ఘనత మాత్రం దివంగత డీఎంకే అధినేత, కలైంజ్ఞర్‌ కరుణానిధి, మాజీ సీఎం జయలలితలకే దక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అప్పట్లో కుప్ప కూలడంలో జయలలిత కీలక పాత్రే పోషించారు.

ఇక, యూపీఏ అధికారంలోకి రావడంతో పాటు, ఆ కేబినెట్లలో అత్యధిక స్థానాలను దక్కించుకుని జాతీయ స్థాయిలో తమిళ ఖ్యాతిని చాటిన నేత మాత్రం కరుణానిధి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ జీవించి లేరు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే ముక్కలు కావడం ,నాయకత్వ లోటు నెలకొనడం వంటి పరిణామాలలో ఆ పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని బల నిరూపణలో పళణి స్వామి సఫలీకృతులు అవుతున్నారు.

అదే సమయంలో కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టి గత లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను స్టాలిన్‌ చాటుకున్నారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌ తాజాగా జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహానాయకులు ప్రస్తుతం జీవించి లేకున్నా, ఆ పార్టీల బలాన్ని అస్త్రంగా చేసుకుని ఢిల్లీ పెద్దలు స్టాలిన్‌, పన్నీరు సెల్వంకు ఎన్‌డీఏ, ఇండియా కూటముల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

పళణికి మోదీ అభయం..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టమే కాకుండా, తన బలాన్ని చాటే ప్రయత్నాలను విస్తృతం చేశారు. ఈ సమయంలో ఎన్‌డీఏ కూటమిలోని అన్నాడీఎంకేకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన్యం ఇవ్వడమే కాకుండా, ఢిల్లీలో జరిగిన సమావేశానికి తనను ఆహ్వానించడం పళణి స్వామిలో మరింత ఉత్సాహాన్ని నింపింది.

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చోవడమే కాకుండా, సమావేశానికి హాజరైన నేతలందరినీ కలిసి తన ఉనికి చాటుకునే విధంగా పళణి జోరు పెంచడం గమనార్హం. ఈ సమావేశం ముగించుకుని బుధవారం చైన్నెకు చేరుకున్న పళణిలో మరింత ఉత్సాహం తొణికిసలాడడం.. ప్రత్యర్థి పన్నీరు సెల్వాన్ని మరింత షాక్‌కు గురి చేసింది.

రానున్న ఎన్నికల ద్వారా జాతీయ స్థాయిలో సత్తాచాటాలంటే అత్యధిక ఎంపీ స్థానాల కైవసం చేసుకోవాలని పళణి భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కూటమికి నేతృత్వం వహించి అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా తన బలాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఉంటుందని పళణి స్పష్టం చేయడం విశేషం. జాతీయ స్థాయిలో తాము ఎన్‌డీఏతోనే ఉంటామని, రాష్ట్రానికి వచ్చేసరికి అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అవినీతికి కేరాఫ్‌ అడ్రస్సుగా మారిన డీఎంకేకు మున్ముందు అన్నీ ఓటములే ఎదురుకానున్నాయంటూ ఆయన పేర్కొనడం గమనార్హం.

తిరుగులేని స్టాలిన్‌..
స్టాలిన్‌కు జాతీయస్థాయి నేతలతో ఎప్పటి నుంచో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరుణానిధి ప్రతినిధిగా అప్పట్లో ఆయన అనేక పార్టీల నేతలను కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో రాణించే ప్రయత్నాలకు కలిసి వస్తోంది. దేశంలో కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ డీఎంకే.

ఇది వరకు కాంగ్రెస్‌ కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే, ప్రస్తుతం రెండు రోజుల సమావేశానంతరం బెంగళూరు వేదికగా కొత్తగా ఆవిర్భవించిన ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ (ఐఎన్‌డీఐఏ–ఇండియా)లోనూ అదే ఊపును కొనసాగించే వ్యూహాలకు పదును పెట్టింది. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ పక్కనే కూర్చోవడమే కాకుండా, సోనియా, మమత, నితీష్‌కుమార్‌ , శరద్‌ పవార్‌, కేజ్రీవాల్‌ వంటి నేతలతో స్టాలిన్‌ కలిసి పోవడం గమనార్హం.

తన ప్రసంగంలోనూ జాతీయ స్థాయి అంశాలను పదే పదేస్టాలిన్‌ ప్రస్తావించడాన్ని బట్టి మున్ముందు ఢిల్లీలో తన తండ్రి, దివంగత నేత కరుణానిధి తరహాలో చక్రం తిప్పేందుకు స్టాలిన్‌ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఆయన ఏ మేరకు సఫలీకృతులు అవు తారో 2024 వరకు వేచి చూడాల్సిందే.

ఈ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటుగా తమిళనాడులోని 40 స్థానాలను కై వశం చేసుకుని జాతీయ స్థాయిలో తన బలాన్ని చాటేందుకు స్టాలిన్‌ సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న అన్నా డీఎంకే, బీజేపీని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ సమావేశంలో పళణి స్వామిని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై వారికి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా..? ఇదే హాస్యాస్పదం అని స్టాలిన్‌ చమత్కరించడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement