Sakshi News home page

IPL 2024: విరాట్‌ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sat, Mar 9 2024 12:33 PM

IPL 2024 Virat Kohli Opens Up On Why He Absolutely Loves IPL - Sakshi

‘‘నాకు ఐపీఎల్‌ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆటగాళ్లు దేశాలకు అతీతంగా సహోదర భావంతో మెలుగుతారు. జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు.. ప్రత్యర్థి జట్టులో మనకెంతో కాలంగా తెలిసిన ప్లేయర్లు.. ఇక్కడ మనతో కలిసి ఆడతారు.

నిజానికి నేను మాత్రమే కాదు నాలాగా చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌ను అమితంగా ఇష్టపడటానికి ప్రధాన కారణం ఇదే. సహచర ఆటగాళ్లే కాదు.. అభిమానులు పంచే ప్రేమ.. వారితో అనుబంధం ఈ లీగ్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి’’ అని టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభమైనప్పటి నుంచి కోహ్లి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ అంటే కోహ్లి.. కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ఫ్రాంఛైజీతో ముడిపడిపోయాడీ రన్‌మెషీన్‌. 2013 నుంచి కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 

అయితే, ఐపీఎల్‌- 2021 తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక గత కొంతకాలంగా వివరాట్‌ కోహ్లి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని.. చిన్నారికి అకాయ్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు కోహ్లి. అయితే, ఐపీఎల్‌-2024 ఆరంభం నాటికి అతడు తిరిగి వస్తాడా లేదా అన్న సందేహాల నడుమ స్టార్‌ స్పోర్ట్స్‌ షో కోహ్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేసింది.

ఇందులో కోహ్లి ఐపీఎల్‌ ప్రాముఖ్యం గురించి చెబుతూ.. పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో ఆడుతున్నప్పుడు ఒకరకంగా శత్రువులుగా ఉండే ఆటగాళ్లు ఇక్కడ మిత్రులుగా మారిపోయి సహోదరభావంతో మెలగడం బాగుంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ మొదలుకానుంది. తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఆర్సీబీ మధ్య జరుగనుంది.

Advertisement
Advertisement