IPL 2024: కేకేఆర్‌ను ఢీకొట్టనున్న పంజాబ్‌.. స్టార్క్‌ ఔట్‌, ధవన్‌ ఇన్‌..? | Sakshi
Sakshi News home page

IPL 2024: కేకేఆర్‌ను ఢీకొట్టనున్న పంజాబ్‌.. స్టార్క్‌ ఔట్‌, ధవన్‌ ఇన్‌..?

Published Fri, Apr 26 2024 12:41 PM

IPL 2024: KKR To Take On Punjab Kings In Eden Gardens Today

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌.. టేబుల్‌ సెకెండ్‌ టాపర్‌ అయిన కేకేఆర్‌ను వారి సొంత మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ పంజాబ్‌కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ లెక్కల్లో ఉంటుంది.

లేకపోతే మరో సీజన్‌లో టైటిల్‌ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్‌ ఏడింట ఐదు మ్యాచ్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తుంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్‌పై కేకేఆర్‌ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్‌ 21, పంజాబ్‌ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.

బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్‌తో పోలిస్తే కేకేఆర్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్‌ స్టార్క్‌ మినహా కేకేఆర్‌కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్‌, రసెల్‌తో పాటు కుర్ర బౌలర్లు  రాణిస్తుండటంతో స్టార్క్‌ వైఫల్యాలు హైలైట్‌ కావడం లేదు.

పంజాబ్‌తో నేటి మ్యాచ్‌లో స్టార్క్‌ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్‌ గత రెండు రోజులుగా ప్రాక్టీస్‌ సెషన్స్‌లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.

పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్‌లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్‌లో పంజాబ్‌కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా శిఖర్‌ తాజాగా జరిగిన ప్రాక్టీస్‌ సెషన్స్‌లో యాక్టివ్‌గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్‌లో స్టార్క్‌ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. 

తుది జట్లు (అంచనా)..
కేకేఆర్‌: ఫిల్ సాల్ట్ (వికెట్‌కీపర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]

పంజాబ్‌: శిఖర్ ధవన్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్]

Advertisement

తప్పక చదవండి

Advertisement