ముంబైకి చెన్నై చెక్‌ | Sakshi
Sakshi News home page

ముంబైకి చెన్నై చెక్‌

Published Sun, Apr 9 2023 1:32 AM

Chennai Super Kings defeated Mumbai Indians by seven wickets - Sakshi

ముంబై: ఐదు సార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో తొలి విజయం కోసం మరింతగా నిరీక్షించక తప్పదు. తొలి పోరులో బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిన రోహిత్‌ సేన రాత సొంత మైదానంలోనూ మారలేదు. శనివారం జరిగిన పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

ఇషాన్‌ కిషన్‌ (21 బంతుల్లో 32; 5 ఫోర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా (3/20) కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది. అజింక్య రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...రుతురాజ్‌ గైక్వాడ్‌ (36 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.  

సమష్టి వైఫల్యం... 
ముంబైకి లభించిన ఆరంభం చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్లో రోహిత్‌ శర్మ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రెండు ఫోర్లు కొట్టగా, మగాలా ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ 3 ఫోర్లు బాదాడు. తుషార్‌ ఓవర్లో సిక్స్‌తో జోరు పెంచే ప్రయత్నం చేసిన రోహిత్, అదే ఓవర్లో ఒక అద్భుత బంతికి క్లీన్‌ బౌల్డయ్యాడు. అంతే...ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

గత మ్యాచ్‌ తరహాలో హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (18 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత డేవిడ్‌ మెరుపులు ముంబైకి కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించాయి. తుషార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో డేవిడ్‌ వరుసగా 6, 4, 6 కొట్టి తర్వాతి బంతికే వెనుదిరగడం విశేషం.  

కీలక భాగస్వామ్యం... 
ఛేదనలో తొలి ఓవర్లోనే చెన్నై జట్టు కాన్వే (0) వికెట్‌ కోల్పోయింది. అయితే రహానే దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా సాగింది. ముఖ్యంగా అర్షద్‌ వేసిన ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో తొలి ఐదు బంతుల్లో రహానే వరుసగా 6, 4, 4, 4, 4 బాదడం అతని సత్తాను చూపించింది.

ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చావ్లా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రహానే 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీ కాగా...ఐపీఎల్‌లో 2020 తర్వాత రహానేకు ఇదే మొదటి ఫిఫ్టీ కావడం మరో విశేషం. 

స్కోరు వివరాలు  
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) తుషార్‌ 21; ఇషాన్‌ కిషన్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) జడేజా 32; గ్రీన్‌ (సి) అండ్‌ (బి) జడేజా 12; సూర్యకుమార్‌ (సి) ధోని (బి) సాన్‌ట్నర్‌ 1; తిలక్‌ వర్మ (ఎల్బీ) (బి) జడేజా 22; అర్షద్‌ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్‌ 2; టిమ్‌ డేవిడ్‌ (సి) రహానే (బి) తుషార్‌ 31; స్టబ్స్‌ (సి) రుతురాజ్‌ (బి) మగాలా 5; షోకీన్‌ (నాటౌట్‌) 18; చావ్లా (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.  వికెట్ల పతనం: 1–38, 2–64, 3–67, 4–73, 5–76, 6–102, 7–113, 8–131. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 1–0–10–0, తుషార్‌ దేశ్‌పాండే 3–0–31–2, మగాలా 4–0–37–1, సాన్‌ట్నర్‌ 4–0–28–2, జడేజా 4–0–20–3, ప్రిటోరియస్‌ 4–0–28–0.  
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 0; రుతురాజ్‌ (నాటౌట్‌) 40; రహానే (సి) సూర్యకుమార్‌ (బి) చావ్లా 61; దూబే (బి) కార్తికేయ 28; రాయుడు (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159.  వికెట్ల పతనం: 1–0, 2–82, 3–125. బౌలింగ్‌: బెహ్రన్‌డార్ఫ్‌ 3–0–24–1, అర్షద్‌ ఖాన్‌ 2.1–0–35–0, గ్రీన్‌ 3–0–20–0, చావ్లా 4–0–33–1, కార్తికేయ 4–0–24–1, హృతిక్‌ షోకీన్‌ 2–0–19–0.    

ఐపీఎల్‌లో నేడు 
గుజ రాత్‌ VS కోల్‌కతా (మ. గం. 3:30 నుంచి) 
హైదరాబాద్‌ VS పంజాబ్‌ (రాత్రి గం. 7:30 నుంచి)

స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
 
Advertisement
 
Advertisement