రేసులో అదానీ, గోయెంకా | Sakshi
Sakshi News home page

రేసులో అదానీ, గోయెంకా

Published Mon, Oct 25 2021 5:50 AM

BCCI expecting between Rs 7000 cr to Rs 10000 cr for ipl new teams - Sakshi

దుబాయ్‌: మళ్లీ పది జట్ల ఐపీఎల్‌కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్‌ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్‌లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్‌ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్‌ బ్రాండ్‌విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కుల మార్కెట్‌ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్‌కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్‌ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

అహ్మదాబాద్‌ లక్ష్యంగా అదానీ
ఐపీఎల్‌లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్‌ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్‌ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్‌ నగరాలు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ అహ్మదాబాద్‌ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్‌పీఎస్‌జీ (రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్‌లో చెన్నై, రాజస్తాన్‌లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌)తో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement