Australia Won-By 113 Runs Vs NZ 2nd ODI Clinch 2-0 Series Win - Sakshi
Sakshi News home page

AUS Vs NZ 2nd ODI: ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి!

Published Thu, Sep 8 2022 5:10 PM

Australia Won-By 113 Runs Vs NZ 2nd ODI Clinch 2-0 Series Win - Sakshi

ఆస్ట్రేలియా పర్యటనలో న్యూజిలాండ్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో కివీస్‌ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 61 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్‌ 25 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ బౌలర్ల దాటికి టాపార్డర్‌, మిడిలార్డర్‌ కకావికలమైంది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో మిచెల్‌ స్టార్క్‌(45 బంతుల్లో 38 నాటౌట్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌(16 బంతుల్లో 23 పరుగులు నాటౌట్‌) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 4, మాట్‌ హెన్రీ 3, సౌథీ, సాంట్నర్‌ చెరొక వికెట్‌ తీశారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఆస్ట్రేలియా బ్యాటింగే దారుణమనుకుంటే.. న్యూజిలాండ్‌ బ్యాటర్లు అంతకన్నా ఘోరంగా ఆడడం గమనార్హం. కేన్‌ విలియమ్సన్‌ 17, మిచెల్‌ సాంట్నర్‌ 16 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఐదు వికెట్లతో కివీస్‌ నడ్డి విరిచాడు. సీన్‌ అబాట్‌, మిచెల్‌ స్టార్క్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కస్‌ స్టోయినిస్‌ ఒక వికెట్‌ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్‌ 11న(ఆదివారం) జరగనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement